కరోనా కారణంగా భౌతిక దూరం పాటించాలన్న నేపథ్యంలో హీరోల పుట్టినరోజు సంబరాలన్నీ ఆన్ లైన్ వేదికగానే జరుగుతున్నాయి. పుట్టినరోజుకి కొన్ని రోజుల ముందు నుండే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ పుట్టిస్తున్నారు. బర్త్ డే ట్వీట్లలో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా అభిమానుల సందడి సోషల్ మీడియాలో దండిగానే ఉంది. కామన్ డీపీ, కామన్ మోషన్ పోస్టర్.. ఇలా రకరకాల పేర్లతో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ బర్త్ డే సీడీపీ విడుదలైంది. రామ్ చరణ్ ఈ కామన్ డీపీని లాంచ్ చేసాడు. రేపటితో మెగాస్టార్ 65వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ కామన్ డీపీలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. మెగాస్టార్ హిట్ సినిమాల్లోని కొన్నింటిని తీసుకుని డిజైన్ చేసారు. ముఖ్యంగా కిందిస్థాయి నుండి పైకి వచ్చినట్టుగా ఒక్కో మెట్టు మీద ఒక్కో హిట్ సినిమాలోని మెగాస్టార్ గెటప్ ని ఉంచారు.
ఇంకా పోస్టర్ కి నాలుగు మూలలా నాలుగు మెసేజ్ లు ఉన్నాయి. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒకటి ఉండగా, కరోనా కారణంగా ఇంట్లోనే ఉండండని చెప్తూ మరోటి, ఇంకా కరోనా బారిన పడ్డవారిని రక్షించడానికి ప్లాస్లా దానం చేయాలన్న మెసేజ్, చివర్లో చిరంజీవి అని చెప్పగానే గుర్తొచ్చే రక్తదానం గురించిన మరో సందేశం ఉంది. మొత్తానికి మెగాస్టార్ కి తగినట్లుగా ఆసక్తికరంగా కామన్ డీపీని తీర్చిదిద్దారు.