నేను శైలజ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన కీర్తి సురేష్, మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే మహానటి సినిమా తర్వాత ఆమె ఎంచుకుంటున్న చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటున్నాయి. తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలని లైన్లో పెడుతూ చాలా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకిపైగా సినిమాలున్నాయి. మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, అన్నాత్తే, రంగ్ దే, మరక్కార్ అరబికదలింటే సింహం, సర్కారు వారి పాట మొదలగు చిత్రాల్లో నటిస్తుంది.
అయితే తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా చిత్ర ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. సాని కాయిదం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. భుజాన కత్తి, చేతిలో తుపాకీ పట్టుకుని శత్రువులకి ఎదురెళ్తున్నట్టుగా ఉంది.
అయితే ఈ సినిమాలో తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా నటిస్తున్నాడు. బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మొదలగు చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సెల్వ రాఘవన్ సాని కాయిదం తో నటుడిగా మారుతున్నాడు. స్క్రీన్ సీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేస్తారట.