రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి తీసుకెళ్ళింది. అప్పటి వరకూ ఎవరూ ఊహించని దాన్ని సాహసించి ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చిత్ర పరిశ్రమకి పేరు తీసుకువచ్చాడు. ఈ సినిమాకి ఐదేళ్ళు శ్రమించిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రపంచ సినిమా తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన ఈ చిత్రం ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమైంది.
చైనా, పాకిస్తాన్, జపాన్, రష్యా భాషల్లో అనువదింపబడి అక్కడి వారిని ఆకర్షించిన బాహుబలి తాజాగా మరో దేశ ప్రజల ముందుకు వెళ్తుంది. తూర్పు ఆసియా దేశమైన మంగోలియా లో బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని మంగోలియన్ భాషలోకి అనువదించి టెలిక్యాస్ట్ చేయనున్నారు. అక్కడి ఛానెల్ అయిన టీవీ 5 లో ఆగస్టు 16వ తేదీన బాహుబలి ప్రదర్శితం అవుతుంది.
ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులని ఆకర్షిస్తున్న బాహుబలి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు గెలుచుకుంది. సినిమా వచ్చి ఐదేళ్ళు పూర్తవుతున్న బాహుబలి హవా మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మంగోలియా వారిని ఎంటర్ టైన్ చేయబోతున్న బాహుబలి తదుపరి మరెన్ని దేశాలు తిరుగుతుందో చూడాలి.