కరోనా వలన థియేటర్స్ అన్నీ మూత పడ్డాయి. ఏకంగా ఐదునెలల నుండి థియేటర్స్ తెరుచుకోలేదు. ఎప్పటికి తెరుచుకుంటాయో కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే చాలామంది చిన్ననిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకి ఇచ్చేశారు. ఇప్పటికే పెంగ్విన్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి సినిమాలు ఓటిటిలో సందడి చెయ్యగా.. మార్చ్ లో విడుదల కావాల్సిన నాని ‘వి’ సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది. దానితో పాటుగా నిశ్శబ్దం, ఉప్పెన, రెడ్ లాంటి సినిమాలు కూడా విడుదల అవ్వకుండా ఆగిపోయాయి. అయితే నాని ‘వి’కి, రామ్ ‘రెడ్’కి, అనుష్క నిశ్శబ్దానికి, వైష్ణవ తేజ్ ఉప్పెనకి ఓటీటీస్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయి. అందులోనూ ‘వి’ కి, ‘రెడ్’కి భారీగా ఆఫర్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో.
కానీ ‘వి’ చిత్రాన్ని అమ్మేది లేదని దిల్ రాజు తేల్చి చెప్పాడు. అయితే తాజాగా ‘వి’ని అమెజాన్ ప్రైమ్ వారు 33 కోట్ల భారీ ఆఫర్‌కి ఓటీటీ రైట్స్ దక్కించుకున్నారు. సెప్టెంబర్ 5న ‘వి’ అమెజాన్ ప్రైమ్‌లో రాబోతుంది. చాలా బెట్టుగా ఉన్న అని దిల్ రాజు చివరికి ‘వి’ని ఓటీటీకి అమ్మేశారని అంటున్నారు. 25 కోట్ల ఖర్చుకీ గాను అమెజాన్ ప్రైమ్ వారు 33 కోట్లు చెల్లించారని అందుకే దిల్ రాజు అమ్మేసాడని అంటున్నారు. ఎలాగూ థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అవ్వవు. అయినా ప్రేక్షకులు రారు. అందుకే నాని - దిల్ రాజు ఆ సినిమాని అమ్మేసారు. ఇక నాని దారిలో ‘నిశ్శబ్దం, రెడ్, ఉప్పెన’ సినిమాలు కూడా నడుస్తాయని అంటున్నారు. ఇప్పటికే అనుష్క నిశ్శబ్దానికి ఓటిటిలో చూస్తే బెటర్ అంటూ ఓ పోల్ సోషల్ మీడియాలో నడుస్తుంది. మరి నాని మాదిరి అనుష్క, రామ్, వైష్ణవ తేజ్ చేసిన చిత్రాల నిర్మాతలు కూడా లొంగి తమ సినిమాలను అమ్మేస్తారో లేదంటే బెట్టు చేస్తారో చూడాలి.