అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాలు చేసినప్పటికీ విజయం మాత్రం అందుకోలేకపోయాడు. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో చేసిన మొదటి సినిమా అఖిల్ బాక్సాఫీసు వద్ద తేలిపోయింది. ఆ తర్వాత ప్రేమకథా చిత్రమైన హలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. మిస్టర్ మజ్ను కూడా అంతగా ఆడలేదు. దాంతో ఈ సారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అఖిల్ బాగా నమ్మకం పెట్టుకున్నాడు.
కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. కరోనా తగ్గి, థియేటర్లు తెర్చుకున్నాక ఈ సినిమా విడుదల అవుతుందట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం అభిమానులకి కూడా ఉంది. అయితే ఈ సినిమా అనంతరం అఖిల్ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడనేది ఇంతవరకూ ప్రకటించలేదు.
తాజా సమాచారం ప్రకారం అఖిల్ ఈ సారి టాలీవుడ్ స్తైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడట. సైరా తర్వాత సురేందర్ రెడ్డి స్టార్ హీరోల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ప్రస్తుతం పెద్ద హీరోలందరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. సో ప్రస్తుతం సురేందర్ రెడ్డి సంధిగ్ధంలో ఉన్నాడు. దాంతో నాగార్జున, సురేందర్ రెడ్డిని లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. మాస్ కథాంశాల్ని స్టైలిష్ గా తెరకెక్కించే సురేందర్ రెడ్డి, అఖిల్ తో సినిమా ఒప్పుకుంటాడో లేదో చూడాలి.