పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ సినిమాల కంటే రీమేక్ చిత్రాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాడట. రీమేక్ చిత్రాలైతే పనులన్నీ చకచకా జరిగిపోతాయన్న ఉద్దేశ్యంతో వాటిపై దృష్టి పెట్టాడట. ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రం సెట్స్ పై ఉండగా మరో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట.
గత కొన్ని రోజులుగా మళయాలీ చిత్రాలు తెలుగులోకి వరుస కట్టేస్తున్నాయి. ఇప్పటికే చాలా చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. తాజాగా అయ్యప్పనుమ్ కోషియం చిత్రాన్ని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. పృథ్వీ రాజ్, బిజు మీనన్ నటించిన ఈ సినిమా మళయాలంలో మంచి సక్సెస్ సాధించింది. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన పవన్ కళ్యాణ్, రీమేక్ పై ఆసక్తిగా ఉన్నాడట.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్ర రీమేక్ హక్కులని కొనుక్కుంది. రానా, రవితేజ హీరోలుగా రీమేక్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఉండడంతో మరో హీరోని వెతకాలని అనుకుంటున్నారట. అన్నీ కుదిరి ఈ సినిమా సెట్ అయితే గనక వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లనుందట. మరి వరుస పెట్టి రీమేక్ చిత్రాలు చేస్తుంటే అభిమానులు ఎలా స్పందిస్తారో..!