తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్టు కోసం వేచి చూస్తున్న హీరోల్లో నారా రోహిత్ ఒకరు. వరుస పెట్టి సినిమాలు తీసినా ఏదీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. కమర్షియల్ గా మాత్రమే కాకుండా విభిన్నమైన కథాంశాలని ఎంచుకుంటూ వైవిధ్యమైన సినిమాలు చేసినప్పటికీ హీరోగా సరైన హిట్ అందుకోలేదు. సోలో తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో విజయం వచ్చిన సినిమా ఒక్కటీ లేదు. అయితే తాజాగా నారా రోహిత్ కొత్త సినిమాతో వస్తున్నాడు.
తన మొదటి చిత్రం బాణం దర్శకుడితో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన బాణం విమర్శకులని మెప్పించింది. అంతేకాదు నటుడిగా నారా రోహిత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న తాజా చిత్రం కూడా బాణం చిత్రం మాదిరిగానే ఆసక్తిగా ఉండబోతుందట. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుందట.
1971 కాలంనాటి కథతో యుద్ధ నేపథ్యంలో సాగుతుందట. దీనికోసం నారా రోహిత్ తన ఆకారాన్ని కూడా చాలా మార్చుకున్నాడు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయట. కరోనా కారణంగా షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత షూటింగ్ మొదలు పెడతారట. వరుస వైఫల్యాలు పొందుతున్న నారా రోహిత్ ఈ సినిమాతోనైనా సరైన హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఈ సినిమా అటు దర్శకుడికీ, ఇటు హీరోకి.. ఇద్దరికీ కీలకమే.