టాలీవుడ్ లో టాప్ మోస్ట్ కమెడియన్ల జాబితా తీసుకుంటే అందులో సునీల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అప్పట్లో సునీల్ లేకుండా సినిమా ఉండకపోయేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే కమెడియన్ గా టాప్ గేర్ లో ఉన్నప్పుడు అందాల రాముడు సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత మర్యాద్ రామన్న, పూల రంగడు.. సినిమాలతో హిట్లు తెచ్చుకుని హీరోగా బిజీ అయిపోయాడు.
అప్పుడే అసలు కథ మొదలైంది. కమెడియన్ గా సూపర్ సక్సెస్ అందుకున్న సునీల్ హీరోగా ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. దాంతో మళ్ళీ కమెడియన్ గా మారదామని ప్రయత్నించినప్పటికీ సరైన హిట్ రాలేదు. అయితే తాజాగా డిస్కోరాజా సినిమాలో విలన్ గా దర్శనమిచ్చాడు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో విలన్ గా సునీల్ అంతగా మెప్పించలేకపోయాడు. దానికి మేకప్, ఇతరత్రా చాలా కారణాలుండొచ్చు. అయితే ప్రస్తుతం మరో మారు విలన్ గా కనిపించడానికి సిద్ధమయ్యాడు.
యాక్టర్ సుహాస్ హీరోగా వస్తున్న కలర్ ఫోటో సినిమాలో విలన్ గా కనిపిస్తున్న సునీల్, ఈ సినిమాతో విలన్ గా నిలబడేలా కనిపిస్తున్నాడు. నిన్న రిలీజైన కలర్ ఫోటో టీజర్ ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. విలన్ గా కళ్ళలో కనిపించే క్రూరత్వం, మాటలో కరుకుదనం స్పష్టంగా కనిపించాయి. కలర్ ఫోటో సినిమాతో సునీల్ విలన్ గా భయపెట్టేలా ఉన్నాడు. చూడాలి మరి సినిమాలో ఏ విధంగా మెప్పిస్తాడో..!