పడి పడి లేచే మనసు, రణరంగం, జాను.. ఇలా వరుసగా ఫ్లాపులని మూటగట్టుకున్న శర్వానంద్, ప్రస్తుతం చేస్తున్న శ్రీకారం సినిమాతో మళ్ళీ విజయపథంలోకి వస్తానని నమ్ముతున్నాడు. కిషోర్ రెడ్డి అనే కొత్త దర్శకుడూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ యువరైతుగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో తెలుగు, తమిళం ద్విభాషా చిత్రానికి ఓకే చెప్పిన శర్వా, తాజాగా మరో ప్రముఖ బ్యానర్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఏషియన్ సినిమాస్ శర్వాని లాక్ చేసిందని సమాచారం. లవ్ స్టోరీ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ఏషియన్ సినిమాస్ మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అప్పుడే రెండు, మూడవ చిత్రాలని లైన్లో పెట్టారు. మొన్నటికి మొన్న నిఖిల్ హీరోగా సినిమాని ప్రకటించిన ఏషియన్ సినిమాస్ తాజాగా శర్వానంద్ హీరోగా మరో సినిమాకి శ్రీకారం చుట్టారు.
అయితే ఈ సినిమాకి దర్శకుడు సహా సాంకేతిక నిపుణులు ఎవరనేది ఇంకా వెల్లడి చేయలేదు. మరికొద్ది రోజుల్లో మిగతా సమాచారం అధికారికంగా ప్రకటిస్తారట. అయితే ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తో మహాసముద్రం సినిమాలో శర్వా హీరోగా నటిస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఏషియన్ సినిమాస్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. మరి ఈ రెండింటిలో ఏ ప్రాజెక్ట్ ని ముందుగా తీసుకువస్తాడో చూడాలి.