నేచురల్ స్టార్ నాని కెరీర్లో మర్చిపోలేని చిత్రాల జాబితా తీసుకుంటే అందులో మొదటి స్థానంలో జెర్సీ ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించిన నాని తన సహజమైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. క్రికెటర్ అంటే ఏదో సాధారణంగా కాకుండా ప్రొఫెషనల్ క్రికెటర్ గా కనిపించి ఆహా అనిపించాడు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు.
మళ్ళీరావా సినిమాతో తనని తాను నిరూపించుకున్న గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో సెన్సిబుల్ ఎమోషన్స్ ని అందంగా చూపించి సక్సెస్ అయ్యాడు. వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, గెలుపు కోసం చేసే కృషికి అవేవీ అడ్డుకావని తెలియజేసే ఈ కథ అందరికీ బాగా నచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి హిట్ గా నిలవడమే కాదు విమర్శకుల మెప్పుని కూడా పొందింది.
ఇప్పటికే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకి ఎంపికైంది. అవును.. టొరెంటో ఫిలిమ్ ఫెస్టివల్ కి ఎంపికై మరింత గౌరవాన్ని దక్కించుకుంది.