అవును.. మీరు వింటున్నది నిజమే. ఇదివరకటి సినిమాలో హీరో తర్వాత ఆ రేంజ్ పాత్రలో నటించిన కమెడియన్ బ్రహ్మానందం.. ఇప్పుడు సీక్వెల్‌లో కనిపించరట. బ్రహ్మీని పక్కనెట్టేసి ఆయన స్థానంలో టాలీవుడ్‌లో ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న వెన్నెల కిశోర్‌ను తీసుకున్నాడట ఆ డైరెక్టర్. అంతేకాదండోయ్ ఆ సినిమా మొత్తం కామెడీతో నడుస్తుంది కాబట్టి వెన్నెలే చిత్రాన్ని హిట్ రేంజ్‌కు తీసుకెళ్తాడని పెద్ద ఎత్తునే ఆ దర్శకుడు ఆశలు పెట్టుకున్నాడట. ఇంతకీ ఆ సీక్వెల్ సినిమా ఏంటి..? ఆ సినిమాను ఎవరు తెరకెక్కిస్తున్నారు..? అసలు బ్రహ్మీని తప్పించి వెన్నెలనే ఎందుకు తీసుకున్నారనే విషయాన్ని ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.!
సూపర్ హిట్ చిత్రంతోనే..!
ఆ డైరెక్టర్ మరెవరో కాదండోయ్ శ్రీను వైట్ల. సీక్వెల్ సినిమా ‘ఢీ’. ‘దూకుడు’ సినిమా తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా కనిపించకుండా పోయిన డైరెక్టర్ శ్రీనువైట్ల. అప్పటి వరకూ స్టార్ డైరెక్టర్ల జాబితాలో ఉన్న ఆయన ఎక్కడికో పడిపోయారు. వరుస ప్లాప్ సినిమాలతో ఆయన్ను దాదాపు అభిమానులు, ఇండస్ట్రీ కూడా మరిచిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘దూకుడు’ తర్వాత శ్రీను కెరియర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. సినిమా చేద్దామంటే ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడం.. ప్లాప్ డైరెక్టర్ అనే ముద్ర పడిపోవడంతో శ్రీను వైట్ల అంటే చాలు హీరోలు, నిర్మాతలు దడుచుకునేంత పనయ్యింది. ఎట్టకేలకు మళ్లీ తన కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ తెచ్చుకోవాలని వైట్ల చేస్తున్న భగీరథ ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే తన కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘ఢీ’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ‘ఢీ’ సీక్వెల్‌కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
వెన్నెలే ఎందుకు..!?
ఈ సినిమాను మంచు విష్ణు స్వయంగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. ‘ఢీ’ లో విష్ణు తర్వాత ఆ రేంజ్ పాత్రలో నటించింది బ్రహ్మానందమే.. ఇది ఎవరు అవునన్నా కాదన్న జగమెరిగిన సత్యమే. సినిమా చూసిన అభిమానులకు బ్రహ్మీ రేంజ్ ఏంటో తెలుస్తుంది. బ్రహ్మీ పాత్రను ఇప్పటికే మర్చిపోలేం. బ్రహ్మీ కామెడీ అని యూ ట్యూబ్‌లో కొడితే చాలు ‘ఢీ’ కి సంబంధించి అందులో లిటిల్ బిట్ అయినా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు సీక్వెల్ సినిమాలో బ్రహ్మీని పక్కనెట్టి ఆయన స్థానంలో వెన్నెల కిశోర్‌ను తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికిప్పుడు సినిమా షూటింగ్‌లు ప్రారంభమైతే బ్రహ్మీ చాలా బిజి బిజీగా ఉంటారు. ఆయన డేట్స్ తీసుకోవడం చాలా కష్టమే. పైగా హీరో తర్వాత ఆయనకు సంబంధించిన సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయ్ కనుగ అన్నేసి రోజులు ఆయన కాల్షీట్లు ఇవ్వరు. అందుకే ఇక ఆయన స్థానంలో బ్రహ్మీ రేంజ్‌కు తగ్గట్లుగా కామెడీని పండించి వెన్నెలను తీసుకోవాలని శ్రీను వైట్ల, విష్ణు ఫిక్సయ్యారట. అంతేకాదు తన సినిమాల్లో చాలా వరకు వెన్నెలకే విష్ణు మార్కులేస్తుంటాడన్న విషయం తెలిసిందే.
ఇతర పాత్రల విషయంలో..
అందుకే కిషోర్‌ను సీక్వెల్ సినిమాలోకి తీసుకోవాలని విష్ణునే వైట్లకు సిఫారసు చేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు విష్ణు కామెడీ.. ఇటు వెన్నెల హాస్యం సినిమాను ఎక్కడికో తీసుకెళ్తుందని భావిస్తున్నారట. మరోవైపు శ్రీహరి పాత్రలో ఎవర్ని తీసుకోవాలి..? హీరోయిన్‌గా మళ్లీ జెనీలియానే తీసుకోవాలా..? లేకుంటే వేరే హీరోయిన్‌ను తీసుకోవాలా..? అని ప్లాన్‌లు చేసే పనిలో శ్రీను వైట్ల ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ చివర్లో షూటింగ్ ప్రారంభించాలని వైట్ల, విష్ణు సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇది ఎంతవరకూ వర్కవట్ అవుతుందో.. తెలియాలంటే సీక్వెల్ సినిమా థియేటర్లలోకి వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.