మంచు విష్ణు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు కెరీర్లో మంచి హిట్ గా నిలిచిన ఈ సినిమా సీక్వెల్ పై గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వస్తున్నాయి. ఢీ సినిమాకి సీక్వెల్ తీయాలని మంచువిష్ణు ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. కాకపోతే శ్రీనువైట్ల నుండి ఎలాంటి సమాచారం లేదని బయటకి వెల్లడి చేసాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఢీ సీక్వెల్ మరికొద్ది రోజుల్లో తెరకెక్కబోతుందని అంటున్నారు.
వరుస ఫ్లాపులు ఎదుర్కొని దర్శకుడిగా అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో శ్రీనువైట్ల, ఈ సీక్వెల్ పై దృష్టి పెట్టాడని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కథ రెడీ అయిపోయిందని టాక్. అయితే ఈ సీక్వెల్ లో ఒకానొక ముఖ్యమైన పాత్రలో టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ నటించనున్నాడని సమాచారం. ఢీ సినిమాలో చారి పాత్రలో బ్రహ్మానందం ఎంతలా నవ్వించాడో అందరికీ తెలిసిందే. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంటూ ఆయన పండించిన కామెడీని ఎప్పటికీ మర్చిపోలేరు.
అయితే ఢీ సీక్వెల్ లో చారి పాత్రలో వెన్నెల కిషోర్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఫ్రస్టేషన్ తో రగిలిపోయే పాత్రల్లో వెన్నెల కిషోర్ పర్ ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. భీష్మ సినిమాలో ఎలా రెచ్చిపోయాడో అందరికీ తెలిసిందే. అందువల్ల చారి పాత్రకి వెన్నెల కిషోర్ అయితేనే న్యాయం చేయగలడని భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనుందట.