దుల్కర్ సల్మాన్ హీరోగా 1964 యుద్ధ నేపథ్య లవ్ స్టోరీతో హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న సినిమా త్రిభాషా చిత్రం
పేరుపొందిన నిర్మాణ సంస్థ స్వప్న సినిమా తన భారీ త్రిభాషా చిత్రాన్ని మంగళవారం ప్రకటించింది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. 1964 కాలంలో జరిగే పీరియడ్ లవ్ స్టోరీగా రూపొందే ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని హను రాఘవపూడి డైరెక్ట్ చేయనున్నారు. ప్రఖ్యాత వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని సమర్పిస్తోంది. జూలై 28 దుల్కర్ సల్మాన్ బర్త్‌డే సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అందమైన టెలిగ్రామ్ నేపథ్యంలో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. సిల్హౌట్ ఇమేజ్‌లో దుల్కర్ ఒక ఆర్మీ మేన్‌గా కనిపిస్తుండగా, రెండు చేతులు కలుసుకున్నట్లు ఇమేజ్ ఫిల్మ్‌లోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపుతున్నాయి.
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నిర్మాణమవుతున్న ఈ ఫిల్మ్‌లో లెఫ్టినెంట్ రామ్ అనే క్యారెక్టర్‌ను పాపులర్ పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ పోషించనున్నారు. బర్త్‌డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్‌లైన్ కనిపిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్న ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్‌ను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంకా దత్ నిర్మిస్తుండగా, వైజయంతీ మూవీస్ సమర్పిస్తోంది.
ప్రభాస్, దీపికా పదుకోనే కాంబినేషన్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్ అనౌన్స్ చేసిన మెగా బడ్జెట్ బహుళ భాషా చిత్రం తర్వాత ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రావడం గమనార్హం. ఈ సినిమానే కాకుండా నందినీరెడ్డి దర్శకత్వంలో మరో చిత్రాన్ని కూడా వైజయంతీ మూవీస్ నిర్మించనున్నది. మరోవైపు ‘జాతిరత్నాలు’ చిత్రం ముగింపు దశకొచ్చింది. దుల్కర్ సల్మాన్, వైజయంతీ మూవీస్ కాంబినేషన్‌లో ఇదివరకు పలు జాతీయ అవార్డులు పొందిన ‘మహానటి’ లాంటి బ్లాక్‌బస్టర్ బయోపిక్ వచ్చింది. దుల్కర్ మునుపటి చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో విడుదలై ఘన విజయం సాధించింది.