గత కొన్ని రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరు ఎంతలా మారుమోగుతుందో అందరికీ తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమాలోని పాటలు బ్లాక్ బస్టర్స్ కావడంతో థమన్ టాప్ లోకి వచ్చేసాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలకి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. బాలీవుడ్ సెలెబ్రిటీల నుండి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వరకూ ఈ సినిమాలోని పాటలకి స్టెప్పులు వేసారు.
యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన పాటలు తెలుగు సినిమాల్లో వన్ బిలియన్ వ్యూస్ దక్కించుకున్న మొదటి ఆల్బమ్ గా రికార్డు దక్కించుకునేలా చేసాయి. అయితే ప్రస్తుతం థమన్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు బాలయ్య బోయపాటి సినిమా, మహేష్- పరశురామ్ కాంబినేషన్ లోని సర్కారు వారి పాట.. ఇంకా ఇతరత్రా చాలా సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న థమన్, తన డ్రీమ్ గురించి బయటపెట్టాడు.
థమన్ కి ఒక మ్యూజిక్ స్కూల్ మొదలు పెట్టాలని ఉందట. థమన్ వయసు యాభైకి చేరువయ్యాక ఈ స్కూలుని స్టార్ట్ చేసి అందులో విద్యార్థులకి ఉచితంగా మ్యూజిక్ పాఠాలు బోధిస్తాడట. తనకి ఎన్నో ఇచ్చిన సంగీతానికి ఆ విధంగా కొంత రిటర్న్ లో ఇవ్వాలని ఫీల్ అవుతున్నాడట.