కరోనా ముగిస్తే సినిమాలు పట్టాలెక్కుతాయనుకుంటే.. కరోనా మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. కరోనా విజృంభిస్తుంది కానీ.. తగ్గే సూచనలు కనిపించడం లేదు. హీరోలెవరైనా ముందుకొస్తారని దర్శకులు ఎదురు చూసి చూసి కరోనాకి దణ్ణం పెట్టారు. కానీ కరోనా శాంతించలేదు. ఇక హీరోలు కూడా కిమ్మనకుండా ఇంట్లోనే ఉంటూ కరోనా ఎప్పుడు తగ్గుతుందో అప్పుడే సినిమా షూటింగ్ అంటున్నారు. అయితే చిరు, పవన్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి షూటింగ్ మొదలెడతారు.. ఆగష్టు నుండి సినిమా షూటింగ్ మొదలవుతాయి అని అనుకుంటుంటే.. అటు చిరు కొత్త లుక్‌తో శంకిస్తే.. ఇటు పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్షతో షాకిస్తున్నాడు.
చిరు - కొరటాల ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా అందరికన్నా ముందే ఆపేసారు. ఇక ఆగష్టు నుండి అయినా ఆచార్య పట్టాలెక్కుతోంది అనుకుంటే.. ఇప్పుడు చిరంజీవి ఆచార్య లుక్ నుండి కొత్త లుక్ లోకి వచ్చేసాడు. చిరు ఇప్పుడు మీసం, గెడ్డం తీసేసి స్లిమ్ గా యంగ్ హీరోలా తయారయ్యాడు. ఇక పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో గోవులకు అరటిపళ్ళు, గడ్డి వేసుకుంటూ గడిపేస్తున్నాడు. అందులోనూ నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్ష అంటున్నాడు. మరి మరో 20 రోజుల షూటింగ్ చేస్తే పవన్ - వేణు శ్రీరామ్ ల వకీల్ సాబ్ షూటింగ్ పూర్తవుతుంది. కరోనా తగ్గి ప్రజలు బావుండాలని పవన్ చతుర్మాస దీక్ష చేస్తున్నాని చెబుతున్నాడు. ఇక ప్రజల కోసం దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ నిర్మాతల కోసం మాత్రం ఆలోచించడం లేదు. మరి పవన్ - చిరు ఇప్పుడప్పుడే సినిమాల కోసం సిద్ధమయ్యేలా కనిపించడం లేదు.