రజనీకాంత్, కమల్ హాసన్ తరం తర్వాత ఈ తరం తమిళ హీరోల్లో ఎవరికీ సాధ్యంకాని విజయాల్ని టాలీవుడ్‌లో సొంతం చేసుకున్న తమిళ నటుడిగా నిలిచాడు సిద్ధార్థ్. తెలుగులో నటించిన తొలి సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తోటే సంచలన విజయం సాధించిన అతడు, ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ‘ఆట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వరకు అతడి పని బాగానే సాగింది. టాలీవుడ్ వరకు చూసుకుంటే కెరీర్ మొదట్లో అతడు చేసిన ఫీట్లు టాప్ స్టార్స్ పవన్ కల్యాణ్, మహేశ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వాళ్లకు కూడా సాధ్యం కాలేదు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చి ఇక్కడ విజయ బావుటా ఎగరువేయడంతోనే ఆగలేదు సిద్ధార్థ్. బాలీవుడ్‌లోనూ గ్రాండ్‌గా ప్రవేశించాడు. అక్కడ నేటి స్టార్లందరిలోకీ పర్ఫెక్షనిస్ట్‌గా పేరుపొందిన ఆమిర్ ఖాన్‌తో ‘రంగ్ దే బసంతి’ సినిమాలో నటించి దేశవ్యాప్తంగా సినీ ప్రియులకు పరిచయమయ్యాడు. అప్పట్లో అతడి విజయ రహస్యమేమిటో అర్థంకాక చాలా మంది హీరోలు తలలు బద్దలుకొట్టుకున్నారు.
కానీ అకస్మాత్తుగా అతడి కెరీర్ తిరోగమన బాట పట్టింది. సంచలనాత్మక హీరో కాస్తా ఫ్లాప్ స్టార్‌గా మారిపోయాడు సిద్ధు. అతడి కరిష్మా మసకబారటం మొదలుపెట్టింది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో చేసిన సంతోష్ క్యారెక్టర్‌తో బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సాధించిన అతడు, ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’లో చేసిన సిద్ధు క్యారెక్టర్‌తోనూ అమితంగా ఆకట్టుకున్నాడు. ఆ రెండు పాత్రలు ప్రేక్షకులకు అతడిని సన్నిహితం చేశాయి. డైరెక్టర్ అవుదామని యాక్టర్ అయిన సిద్ధార్థ్ తనకు అనూహ్యంగా లభించిన ఇమేజ్‌ను ఎంజాయ్ చేశాడు.
ఆ తర్వాత ‘ఓయ్’, ‘బావ’, ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టాయి. దిల్ రాజు నిర్మించిన ‘ఓ మై ఫ్రెండ్’ కూడా ఫ్లాపవడంతో తమిళ సినిమాల మీద దృష్టి పెట్టాడు సిద్ధార్థ్. 2013లో వచ్చిన ‘జబర్దస్త్’ సినిమా తర్వాత అయితే టాలీవుడ్‌లో అతడితో సినిమాలు తీయడానికి పేరుపొందిన నిర్మాతలెవరూ సాహసం చెయ్యలేదు. సమంత జోడీగా అతను నటించిన ఆ సినిమా అంతటి డిజాస్టర్ అయ్యింది మరి. అతని నటనలో సహజత్వం బదులు ఓవరాక్షన్ కనిపిస్తోందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలగడమే అతడి సినిమాల ఫెయిల్యూర్‌కు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అందుకేనేమో తమిళంలో భిన్న తరహా సినిమాలు చేస్తూ వచ్చాడు సిద్ధార్థ్. వాటి తెలుగు వెర్షన్లు ‘180’, ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గృహం’ ఫర్వాలేదనిపించాయి. ‘గృహం’కు అతడు ప్రొడ్యూసర్ కూడా. అతడి ‘జిగర్తాండ’ మూవీ తెలుగులో ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ అయ్యింది. గత ఏడాది వచ్చిన ‘అరువమ్’ సినిమా ‘వదలడు’ పేరుతో తెలుగులో డబ్బయి ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం అతను కోలీవుడ్‌లో ‘సైతాన్ కా బచ్చా’, ‘టక్కర్’ సినిమాలతో పాటు శంకర్ సినిమా ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నాడు. తెలుగు ప్రాజెక్ట్స్ నేరుగా రాకపోయినా తమిళం నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలతోనైనా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు సిద్ధు. కాకపోతే.. తెలుగులో అతడి కెరీర్ మొదలైన తీరును గుర్తు చేసుకుంటే.. ఎలాంటి ఇమేజ్‌తో ఉండాల్సిన హీరో ఎలా అయిపోయాడు?.. అని మనసు చివుక్కుమనకుండా ఉండలేదు. అది అతడి స్వయంకృతాపరాధమే అనేది చాలామంది అభిప్రాయం.