‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘బీరువా’ సినిమాల తర్వాత మరో హిట్ కోసం బ్యాచిలర్ హీరో సందీప్ కిషన్ నాలుగేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. గత ఏడాది ‘నిను వీడని నీడను నేనే’ అనే థ్రిల్లర్‌తో ఎట్లాగో గట్టెక్కాననిపించుకున్నాడు. నిజానికి అది కూడా పెద్ద హిట్టేమీ కాదు. పబ్లిసిటీ స్టంట్‌తో గట్టెక్కిన సినిమా అది. దాని తర్వాత జి. నాగేశ్వరరెడ్డి డైరెక్షన్‌లో అతను చేసిన ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమా డిజాస్టర్ అవడంతో సందీప్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అంతకు ముందు రన్, ఒక్క అమ్మాయి తప్ప, శమంతకమణి, నక్షత్రం, మనసుకు నచ్చింది, నెక్స్ట్ ఏంటి అనే వరుస డిజాస్టర్లతో హోరెత్తించాడు సందీప్. ప్రస్తుతం అతని ఆశలన్నీ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ మీదే ఉన్నాయి. గత ఏడాది తమిళంలో హిట్టయిన ‘నట్‌పే తునై’ ఆధారంగా నూతన దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా అతని భవిష్యత్ కెరీర్‌కూ ముఖ్యమైనదే.
మ్యూజికల్ స్పోర్ట్స్ కామెడీగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ తయారవుతోంది. ఇందులో ఫ్రాన్స్‌కు వెళ్లాలనే యాంబిషన్ ఉన్న యువకుడి క్యారెక్టర్‌ను సందీప్ పోషిస్తున్నాడు. కథ ప్రకారం అతను ఓ హాకీ ప్లేయర్ అయిన అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ద్వారా స్థానిక హాకీ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించే ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ అయిన మురళీశర్మను కలుస్తాడు. ఆ హాకీ టీమ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్‌ను స్వాధీనం చేసుకొని, అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టేందుకు ఒక రాజకీయ నాయకుడి అండదండలున్న కార్పొరేట్ కంపెనీ ప్లాన్ చేస్తున్న విషయం కోచ్‌కు తెలుస్తుంది.
అక్కడ ఫ్యాక్టరీ కడితే చుట్టుపక్కల నీటివనరులన్నీ కలుషితమవడమే కాకుండా, అక్కడి జనం ఆరోగ్యం పాడవుతుంది. ఆ గ్రౌండ్ కార్పొరేట్ కంపెనీ పాలవకుండా ఉండాలంటే, స్టేట్‌లోనే పెద్ద పేరున్న హాకీ టీమ్‌ను మురళీశర్మ హాకీ టీమ్ ఓడించాలి. తన టీమ్ హాకీ ప్లేయర్స్‌ను సెలక్ట్ చేసే పనిలో సందీప్ గతంలో జూనియర్ వరల్డ్ కప్ ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ అనే విషయం మురళీశర్మకు తెలుస్తుంది. తన టీమ్‌లో చేరమని సందీప్‌ను అడుగుతాడు శర్మ. కానీ సందీప్ అందుకు నిరాకరిస్తాడు. తానెందుకు హాకీని వదిలేశాడో ఆ గతాన్ని వివరిస్తాడు.
చూస్తుంటే నాని ‘జెర్సీ’ సినిమాతో కొన్ని పోలికలు ఉన్నట్లు కనిపిస్తున్నా, మిగతా కథ దానికి భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇందులోని కథనం, సన్నివేశాలు కొత్తగా ఉంటాయనీ, సినిమాలో చక్కని ఎంటర్‌టైన్‌మెంట్ ఉందనీ నిర్మాతలు అంటున్నారు. నిర్మాతల్లో సందీప్ కూడా ఉండటం గమనార్హం. సందీప్‌కు ఈ క్యారెక్టర్ బాగా సూటయ్యిందనీ, ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’తో అతను ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కాలం నాటి సందీప్‌ను గుర్తు చేస్తాడనీ యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. సందీప్ జోడీగా, హాకీ ట్రైనీగా లావణ్యా త్రిపాఠి తొలిసారిగా నటిస్తోంది.
‘అల.. వైకుంఠపురములో’ మూవీలో వాల్మీకి పాత్రతో అదరగొట్టిన మురళీశర్మ ఈ సినిమాలో హాకీ కోచ్‌గా మరోసారి ఆ తరహా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడంటున్నారు. ఇక కార్పొరేట్ కంపెనీ కొమ్ముకాసే పొలిటీషియన్‌గా రావు రమేష్ తనదైన శైలి విలనిజాన్ని చూపించనున్నారు. తమిళ ఒరిజినల్‌కు మ్యూజిక్ ఇచ్చిన హిప్‌హాప్ తమిళ ఈ సినిమాకీ బాణీలు అందిస్తున్నాడు. నిజానికి ఒరిజినల్‌లో హీరో కూడా అతడే. ఆ సంగతి అలా ఉంచితే ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’గా సందీప్ కిషన్ అలరిస్తాడో, లేదో.. వేచి చూడాలి.