ఇండస్ట్రీలో సక్సెస్సే ప్రామాణికం. అయితే అందరూ వరుసగా సక్సెస్ లు ఇచ్చుకుంటూ పోలేరు. కెరీర్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక స్థితిలో వరుస వైఫల్యాలని ఎదుర్కొంటుంటారు. అలాంటి టైమ్ లోనే కొందరు ఫేడ్ అయిపోతుంటారు. కొందరు మాత్రమే వైఫల్యాలని ఎదుర్కొని మరీ నిలబడుతుంటారు. అలాంటి వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. టెంపర్ కి ముందు పూరీ సినిమాలన్నీ డిజాస్టర్ బాట పట్టాయి.
ఇక పూరి పని అయిపోయిందని అనుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ని కొత్తగా చూపిస్తూ టెంపర్ తో వచ్చాడు. ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే కాదు పూరి కెరీర్లోనూ ఎంతో కీలకమైంది. పోలీస్ గా ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించాడు. ఇక టెంపర్ తర్వాత పూరి చేసిన సినిమాలు అపజయాలని మూటగట్టుకున్నాయి. ఈ సారైతే కష్టమే అన్నారు. తన రూటు మార్చి మరీ మెహబూబా సినిమా తీస్తే అందులో పూరి మార్క్ కనిపించలేదన్నారు. ఏదీ ఏమైనా ఆ సినిమా ఫ్లాప్..
పూరీతో పెద్ద హీరోలు కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని వార్తలు వచ్చాయి. ఆ టైమ్ లో పూరీకీ ఎనర్జిటిక్ స్టార్ రామ్ దొరికాడు. ఈ కాంబినేషన్ పై మొదట్లో ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఇస్మార్ట్ శంకర్ అనే క్యాచీ టైటిల్ తో సినిమా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక కూడా పెద్దగా పాజిటివిటీ కనిపించలేదు. కానీ ఒక్కసారి థియేటర్లో బొమ్మ పడగానే బాక్సాఫీసు దద్దరిల్లిపోయింది.
పూరి పని అయిపోయిందన్న వాళ్లకి మళ్ళీ పూరీ అంటే ఏమిటో తెలిసేలా చేసింది. అప్పటి వరకూ చాక్లెట్ బాయ్ గా చూసిన రామ్ మాస్ హీరోగా కనిపించేసరికి ప్రేక్షకులు అవాక్కైపోయారు. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున విడుదలైన ఈ చిత్రం పూరీ కెరీర్ ని సక్సెస్ దారిలోకి తెచ్చింది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.