మహానటి సినిమాలో జెమినీ గణేషన్ గా కనిపించిన దుల్కర్ సల్మాన్ ని అంత తొందరగా ఎవరూ మర్చిపోరు. ఆ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయిన ఆ నటుడు, తెలుగులో చేసిన మొదటి సినిమా అది. మళయాల చిత్రమరిశ్రమకి చెందిన దుల్కర్, తమిళంలోనూ సినిమాలు చేస్తున్నాడు. దుల్కర్ చిత్రాలు తెలుగులోనూ అనువాదాలుగా వస్తుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా దుల్కర్ తెలుగులో డైరెక్టుగా కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి.
తెలుగులో హీరోగా కనిపించబోయే సినిమాకి అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అన్నారు. అందాల రాక్షసి సినిమాతో విమర్శకులని మెప్పించిన హను, ఆ తర్వాతా నాని హీరోగా తెరకెక్కించిన క్రిష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత లై, పడి పడి లేచే మనసు చిత్రాలు బాక్సాఫీసు వద్ద తమ సత్తాని చాటలేకపోయాయి.
అయినా హను టాలెంట్ మీద ఉన్న నమ్మకంతో దుల్కర్ ఈ అవకాశం ఇచ్చాడని చెప్పుకున్నారు. 2020 చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్ వినబడింది. అయితే తాజా సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ ఈ సినిమాని హోల్డ్ లో పెట్టాడట. ఆల్రెడీ కమిట్ అయిన మళయాల, తమిళ చిత్రాలని పూర్తిచేసిన తర్వాయే తెలుగు మీద ఫోకస్ పెడతాడట. చూడాలి మరేం జరగనుందో..!