ఫిదా సినిమాతో తెలుగు తెరకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి, ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీ చిత్రంతో పాటు వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం మరోటి. కరోనా లేకపోతే ఈ పాటికి ఈ సినిమాలు రెండు థియేటర్లలోకి వచ్చి ఉండేవి. కానీ ప్రస్తుతానికి ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి.
అయితే ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. లవ్ స్టోరీ చిత్రంలో నాగచైతన్యతో జోడీ కట్టిన సాయి పల్లవి, విరాట పర్వంలో రానా సరసన చేస్తుంది. లవ్ స్టోరీతో మరోసారి ఫిదా చేయబోతున్న సాయిపల్లవి విరాటపర్వం సినిమాలో విభిన్నమైన పాత్రలో జానపద గాయనిగా కనిపించనుంది. అయితే ఈ రెండు చిత్రాల అనంతరం సాయిపల్లవి చేసే సినిమాపై అప్పుడే కథనాలు మొదలయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి మరోమారు పీరియాడికల్ డ్రామాలో నటిస్తుందట. విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించబోతున్న సినిమాలో సాయిపల్లవినే హీరోయిన్ గా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.