Advertisement
Google Ads BL

వాళ్లు.. నిర్మాత‌ల‌కు ‘చుక్క‌లు’ చూపిస్తున్నారు!


జీవనం కోసం పగలంతా కష్టపడి అలసినవాళ్లకు కొద్దిసేపైనా విశ్రాంతీ, వినోదం అవసరం. అందువల్లే వినోదాన్నిచ్చే సినిమాలు, టీవీ జన జీవనంలో ప్రాధాన్యం ఏర్పరచుకున్నాయి. నిజానికి ఇవాళ సినిమాకు పరమావధి వినోదమే. నిత్య జీవితంలో మనం పడ్డ శ్రమనూ, కష్టాన్నీ మరిపించి సినిమాలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. అందుకని మంచికో, చెడుకో ఈ సినీ పరిశ్రమ ఏర్పడిన నాటినుంచీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ ఇవాళున్న స్థాయికి చేరింది.

Advertisement
CJ Advs

హాలీవుడ్‌లో తయారయ్యే సినిమాల్లో ఎక్కువ సెక్స్‌, వ‌యొలెన్స్‌ కనిపిస్తాయి. యువత విష‌యంలో అవి విష ఫలితాల్ని కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో సామాజిక సంస్థలు, మహిళా సంఘాలూ కొన్నేళ్ల క్రితం వాటిని మన ప్రాంతంలో నిషేధించాలని ఆందోళనలు కూడా చేశాయి. కానీ ఇవాళ ఇంటర్నెట్ కారణంగా మితిమీరిన అశ్లీలత అందుబాటులోకి రావడంతో సినిమాల్లోని వ‌ల్గారిటీ, సెక్స్‌, వ‌యొలెన్స్‌ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేటి మన సినిమాల్ని గమనిస్తే కామెడీ పేరుతో ఎంత వ‌ల్గారిటీ చలామణీ అవుతుందో అర్థమవుతుంది. అశ్లీలంగా, అభ్యంతరకరంగా తోచిన సన్నివేశాల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించడానికి ఏర్పాటుచేసిన సెన్సార్ బోర్డులు ఆ పనిని చేయకుండా ‘చూసీచూడనట్లు’ పోతుండటంతో అలాంటి సన్నివేశాలు మన సినిమాల్లో సాధారణ విషయం కింద తయారయ్యాయి.

హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాల్లోని సెక్స్ సన్నివేశాల్నీ, అర్ధనగ్నత్వాల్నీ మనవాళ్లు గుడ్డిగా.. కాదు కాదు.. యథేచ్ఛగా అనుకరిస్తున్నారు. ఇవి మనదేశ పునర్నిర్మాణానికి గానీ, సంస్కృతీ వికాసానికి గానీ ఏమాత్రం తోడ్పడవు. కొన్నేళ్లుగా తెలుగులో కానీ, హిందీలో కానీ తయారవుతున్న చిత్రాల్లో చాలావరకు విదేశీ సినిమాల అనుకరణే అని చెప్పాలి. అందుకే వాటిలో నేటివిటీ అనేది కనిపించడం లేదు. కథా విశిష్టత మచ్చుకైనా కానరావడం లేదు. ఈ విషయంలో మన పొరుగున ఉన్న తమిళ సినిమా చాలా బెటర్ అని చెప్పాలి. వాళ్లు నేటివిటీతో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో అక్కణ్ణించి తెలుగులో అనువాదమై వస్తున్న సినిమాలు చెబుతున్నాయి.

మొదట్లో నిర్మాతల అధీనంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉండేవాళ్లు  తారలు. అయితే వాళ్లలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ బయలుదేరి, ‘కాల్షీట్ల’ పద్ధతిలో ఒకేసారి నాలుగైదు సినిమాల్ని ఒప్పుకోవడం మొదలుపెట్టారు. తాము అంత శ్రమ పడగలమో, లేదో కూడా ఆలోచించలేని విధంగా వాళ్ల ఆశలు మితిమీరిపోయాయి. ఫలితంగా సినిమా బడ్జెట్ నిర్మాత అదుపులో లేకుండా పోయింది. షూటింగ్‌కు అయ్యే ఖర్చు కంటే తారల, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే నిర్మాత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన దరిద్రపు స్థితి వచ్చింది.

మరోవైపు టెలివిజన్ రాకతో సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా పడిపోయింది. నూటికి పది సినిమాలు మాత్రమే గట్టెక్కే రోజులు వచ్చాయి. దీంతో అసలు చిత్ర పరిశ్రమ నిలుస్తుందా, లేదా అని అసలు సిసలు సినిమా ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తారల్లో మచ్చుకి వెతికినా సహకారమనేది కనిపించడం లేదు. వాళ్లు పూర్వం మాదిరిగానే కోట్లు కావాలని కూర్చుంటున్నారు. వాళ్లడిగిన డబ్బు ఇవ్వడమే కాదు, వాళ్లు సెట్స్‌పైకి ఎప్పుడొచ్చినా.. అదేమని అడగకూడదు. వాళ్లు వచ్చిందే భాగ్యమన్నట్లు అప్పుడే సీన్లు తీసుకోవాలి.

వాళ్లు ఇలాంటి ప్రవర్తనతో తమనెంతగా బాధపెడ్తున్నా, నిర్మాతలు జీ హుజూర్ అంటున్నారు. చిత్రమేమంటే ఈ బడా తారలు నటిస్తున్న చిత్రాల్లో చాలా భాగం భారీ పరాజయాలు మూటగట్టుకుంటున్నాయి. నిజానికి ఇవాళ చిన్న తారలు నటిస్తున్న సినిమాలే నిర్మాతకు మనశ్శాంతినిస్తున్నాయి. అయినా పెద్ద తారల విలువ తగ్గడం లేదు. వాళ్లపై మోజు అంతకంతకూ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు. స్టార్ సిస్టంను ఈ నిర్మాతలే ప్రోత్సహిస్తున్నట్లు  కనిపిస్తోంది. వీళ్లే భారీ పారితోషికాలిచ్చి మరీ ముంబాయి, ఇతర భాషా చిత్రాల నాయికలను, నటులను బుక్ చేస్తున్నారు. దానితో తెలుగు కళాకారులు చికాకు ప్రదర్శిస్తున్న సందర్భాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. అప్పనంగా వచ్చిపడుతున్న డబ్బు కారణంగా ఇతర భాషల నటులు తమ సొంత భాషా చిత్రాల కంటే తెలుగు చిత్రాలంటేనే మోజుపడే స్థితికి వచ్చారు.

సినిమా నిర్మాణంపై ఏమాత్రం అవగాహన లేకుండా కొంతమంది వ్యాపారులు అందులోకి దిగి అనవసరంగా డబ్బును నాశనం చేస్తున్నారు. చాలా సినిమాలు విడుదలకు నోచుకోకుండా మురిగిపోతుండటానికి వాళ్ల అజ్ఞానమే కారణం. వీటిపై వందల కోట్ల రూపాయలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితికి డిస్ట్రిబ్యూటర్లు, డబ్బు పెట్టుబడిదార్లు కూడా కారణమే. నిజాయితీ ఉన్న నిర్మాతలకు డబ్బు ఇచ్చేందుకు వెనుకాడి, మోసగాళ్లను మేపడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అందుకే చిత్ర పరిశ్రమ నిరంతర ఒడిదుడుకులతో సతమతమవుతూ సాంకేతికంగా పురోగమిస్తున్నదే కానీ, నిర్మాతల్లో ఎక్కువ శాతం మందికి బాధ‌ల‌ను కలిగిస్తూ కుంటి నడకతో సాగుతూ ఉంది.

Producers Not Happy in Tollywood with actors Gesture :

Producers Faces Problems with Actors 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs