బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన అరణ్య కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది. ఇంకా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం చిత్రీకరణ నిలిచిపోయింది. అయితే విరాట పర్వం సినిమాపై అభిమానుల్లో అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.
ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్లకి మంచి స్పందన వచ్చింది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో 1990 ప్రాంతంనాటి పరిస్థితులను చూపించనున్నారట. విప్లవం నుండే ప్రేమ మొదలవుతుందమన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహిళల పాత్రలు చాలా బలంగా ఉండనున్నాయట. హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి పాత్రతో పాటు కీలక పాత్రల్లో నటిస్తున్న ప్రియమణి, జెరీనా వాహెబ్, ఈ శ్వరీ రావు, నందితా దాస్ మొదలగు వారి పాత్రలు చాలా బలంగా కనిపిస్తాయట.
రానా తర్వాత వీరి క్యారెక్టర్లు అత్యంత శక్తివంతంగా కనిపించి ఆలోచింపజేసేలా ఉంటాయని చెబుతున్నారు. వాస్తవ సంఘటనలని ఆధారంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. కరోనా క్రైసిస్ కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణ అన్నీ కుదురుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందట.