టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు..? అనే విషయంతో పాటు పలు లుక్స్‌ను రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో పాటు ఓ రష్యన్ మహిళ కూడా ఉంటుందని ప్రకటించేశారు. ఇప్పటికే దాదాపు చాలా పోస్టర్లే చిత్ర విచిత్రంగా ఆర్జీవీ వదిలారు. ఈ పోస్టర్లపై ఇంతవరకూ పవన్ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు కానీ మెగాభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో ఆర్జీవీపై దుమ్మెత్తిపోస్తున్నారు.
సెంటిమెంట్‌తో..!
అయితే.. రెచ్చగొట్టే విధంగా లుక్స్, టైటిల్ పెట్టిన ఆర్జీవీ తాజాగా పవన్‌ను సెంటిమెంట్‌తో కొట్టాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. ‘తొలిప్రేమ’ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్‌కు పవర్ స్టార్ అనే బిరుదొచ్చింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యింది జులై 24న.. ఈ తారీఖుతో పవన్‌కు-మెగాభిమానులకు, జనసేన కార్యకర్తలకు చాలా అనుబంధమే ఉంది. అయితే అదే రోజునే సినిమాను రిలీజ్ సెంటిమెంట్‌పై కొట్టాలని వర్మ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే దాదాపు సినిమా పూర్తి కావొచ్చిందని.. ఎడిటింగ్ త్వరలోనే కంప్లీట్ చేసి ఈ నెల 24న విడుదల చేయాలని తన సిబ్బందితో రాత్రింపగళ్లు పనిచేయిస్తున్నారట.
ఏమేం ఉంటాయ్!
ఇదిలా ఉంచితే ‘పవర్ స్టార్’గా తొలిప్రేమ తర్వాతే మారాడు గనుక అదే రోజున రిలీజ్ చేస్తే బాగుంటుందని.. వర్మ ఆలోచన అని నెట్టింట్లో మరో చర్చా సాగుతోంది. కాగా.. ఎన్నికల తరవాత కథ అని ట్యాగ్ లైన్ పెట్టి ‘జనసేన’ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తరవాత వవన్ ఏం చేశాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అనే ఆసక్తికరమైన విషయాల్ని ఈ కథలో ఆర్జీవీ చూపించబోతున్నాడు. అయితే.. ఇంతవరకూ ఆర్జీవీ తీసిన సినిమాలు ఓ లెక్క ఇదో లెక్క.. మరి ఏయే విషయాలు ఇందులో చూపిస్తారో.. వివాదాస్పద విషయాలు, నిర్ణయాలు కూడా ఇందులో ఉంటాయా..? అని అని ఔత్సాహికులు, మెగాభిమానులు సైతం ఎంతగానో వేచి చూస్తున్నారు. సినిమా ఎప్పుడు పూర్తవుతుందో.. ఏమేం విషయాలు ఇందులో ఉంటాయో తెలియాలంటే ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో రిలీజ్ అయ్యే వరకూ వేచి చూడక తప్పదు మరి.