అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అందుకుందో అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమా రిలీజ్ కి ముందే మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సామజవరగమనా మొదలుకుని, రాములో రాములా, ఓ మై డాడీ, బుట్టబొమ్మ ఇలా ప్రతీ పాట హిట్టే.
నిజం చెప్పాలంటే ఈ సినిమా విజయంలో పాటల పాత్ర చాలా ప్రముఖమైనది. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరు మోగిపోయింది. సోషల్ మీడియాలో ఈ పాటల సందడి మామూలుగా కనిపించలేదు. ముఖ్యంగా టిక్ టాక్ ద్వారా బుట్టబొమ్మ సాంగ్ ఖండాంతరాలు దాటింది. అయితే తాజాగా బుట్టబొమ్మ పాట మరో కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. బుట్టబొమ్మ వీడియో సాంగ్ కి యూట్యూబ్ లో 260 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి.
దీంతో అప్పటి వరకూ ఈ రికార్డు ఉన్న ఫిదా సినిమాలోని వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే సాంగ్ కిందకి దిగి రెండో స్థానంలోకి చేరింది. ప్రస్తుతం బుట్టబొమ్మ సాంగ్ టాలీవుడ్ లోనే ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న వీడియో సాంగ్ గా రికార్డు నెలకొల్పింది. మొత్తానికి బన్నీ అలవైకుంఠపురములో చిత్రం థియేటర్లలో నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేస్తే, సినిమాలోని పాటలు యూట్యూబ్ లో ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాయి.