బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయనది ఆత్మహత్య కాదని హత్యేనని కొందరు అనుమానాలు లేవనెత్తగా.. ఇంకొందరు ఇండస్ట్రీకి చెందిన వారే ఆయన ఆత్మహత్యకు కారణమని ఇలా రకరకాలుగా వార్తలు వినిపించాయి. ఇవన్నీ అటుంచితే.. రాజ్‌పుత్ మరణాంతరం ‘నెపోటిజం’ అనే వ్యవహారం ఎక్కువగా వినిపించింది. నాటి నుంచి నేటి వరకూ అటు మీడియా.. ఇటు సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తూనే ఉంది. ఈ ప్రకంపనలు బాలీవుడ్‌లో తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎవరో ఒకరు నిత్యం ఈ నెపోటిజం గురించి మాట్లాడుతుండటంతో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి.
వాస్తవానికి.. నెపోటిజం అంటేనే బాలీవుడ్‌లో మొట్ట మొదట అందరికీ గుర్తుకొచ్చేది టాప్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ పేరే. ఎందుకంటే ఈయన సాదా సీదా సెలబ్రిటీలతో కాకుండా స్టార్ కిడ్స్‌కే ప్రాధాన్యత ఇస్తూ వారితోనే సినిమాలు తీయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. దీంతో ఆయనపై అదో ముద్ర పడిపోయింది. ఈ నెపోటిజం వల్లనే రాజ్‌పుత్ ఇండస్ట్రీలో ఎదగలేకపోయాడని.. ఆయన్ను కరణ్‌తో పాటు పలువురు హీరోలు, నిర్మాతలు తొక్కేశారనే ఆరోపణలూ ఉన్నాయి. అంతేకాదు.. సుశాంత్ మరణాంతరం కరణ్‌కు సోషల్ మీడియా, ఫోన్ల రూపంలో చాలానే బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ తరుణంలో తీవ్ర మనోవేదనకు గురై.. పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.
అయితే.. ఈ ఆరోపణలు, నెపోటిజం వ్యవహారంపై తాజాగా కరణ్ అత్యంత ఆప్తుడు ఒకరు జాతీయ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సుశాంత్ మరణాంతరం కరణ్ కుంగిపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా కలత చెందిన కరణ్.. కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయని మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కరణ్ పూర్తి డిప్రెషన్‌లో ఉన్నాడని.. కనీసం ఎవరినీ కలవడానికి కానీ ఫోన్‌లో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదన్నాడు. కాగా.. కరణ్ తన లాయర్ సలహా మేరకే ఏ విషయంపైనా మీడియాలో కానీ.. సోషల్ మీడియాలో స్పందించలేదన్నారు. అసలు తానేం తప్పు చేశాను.. కుంగిపోతూ నిత్యం కరణ్ ఏడుస్తున్నాడని ఆయన మిత్రుడు జాతీయ మీడియాకు వివరించారు. కాగా ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శకులు ఒంటికాలిపై లేస్తున్నారు.