2020 జనవరిలో ‘అల.. వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల ఫీవర్‌తో వెర్రెత్తిన తెలుగు ప్రేక్షకులు 2021 జనవరిలో ‘ఆచార్య’ వస్తాడని ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమ అగ్ర కథానాయకుడిగా వెలిగిన చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమా వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్‌కే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కరోనా మహమ్మారి కరాళ నృత్యం లేనట్లయితే మెగా ఫాన్స్ సంబరాలు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండేవాళ్లు.
ప్రచారంలో ఉన్న దాని ప్రకారం సామాజిక కార్యకర్తగా మారిన నక్సలైట్‌గా మెగాస్టార్ కనిపించనున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్‌తో చేసిన హిట్ ఫిల్మ్ ‘భరత్ అనే నేను’ తర్వాత అతను పనిచేస్తున్న సినిమా ఇదే. చిరంజీవి కమ్‌బ్యాక్ ఫిల్మ్ ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రాల్ని నిర్మించిన రామ్‌చరణ్ ఈ సినిమాని నిరంజన్‌రెడ్డి అనే మరో నిర్మాతతో కలిసి నిర్మిస్తున్నాడు.
‘సైరా’ తర్వాత చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇంతదాకా నిర్మాతలు ఎలాంటి ప్రచారాన్నీ ఇవ్వకుండా లోప్రొఫైల్‌లో ఈ సినిమాని నిర్మిస్తున్నప్పటికీ, ఆ సినిమా గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే వస్తోంది మీడియా. ‘సైరా’లో తొలినాటి స్వాతంత్ర్యసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా కనిపించిన మెగాస్టార్, ఈ సినిమాలో టైటిల్‌కు తగ్గట్లు సమాజాన్ని ప్రభావితం చేసే ఒక గౌరవప్రదమైన పాత్రను చేస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’లో ‘అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ’ అన్న చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరోసారి ఈ చిత్రంలో ఆయనతో జోడీ కడుతోంది. ఇప్పుడూ ఈ జంట ప్రేక్షకుల్ని అలరిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమాని 100 రోజుల్లో పూర్తి చెయ్యాలని చిరంజీవి తపనపడ్డారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజిమీదే డైరెక్టర్ కొరటాల శివకు ఆ మేరకు ఆదేశాలిచ్చారు. ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తుండటం వల్ల బడ్జెట్ ఊహాతీతంగా పెరిగిపోతోందనీ, ప్లాన్ ప్రకారం భారీ సినిమాల్ని 100 రోజుల్లో తీస్తే బడ్జెట్ అదుపులో ఉంటుందనీ ఆయన నొక్కి వక్కాణించారు. కొరటాల కూడా సరేనన్నాడు. చిరంజీవి ఒకటి తలిస్తే, విధి ఇంకోటి తలచిందన్నట్లు కరోనా వచ్చి ఆయన ఆశయాలపై నీళ్లు చల్లింది. కరోనా రాకపోయినట్లయితే, ఈ సరికి సినిమా షూటింగ్ చివరకు వచ్చేసి ఉండేది. అందుకు అనుగుణంగా దసరా పండగకు ‘ఆచార్య’ పండగ కూడా తోడై ఉండేది. ఇప్పుడు ప్రభుత్వాలు షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా స్టార్ట్ చెయ్యడానికి చిరంజీవి బృందం మల్లగుల్లాలు పడుతోంది. కరోనా భయం అంతగా వ్యాపించి ఉంది మరి.
ఈ సినిమాలో అరగంట సేపు ఉండే మరో కీలక పాత్ర కోసం నటుడి ఎంపిక వ్యవహారం కొంత కాలం క్రితం క్లిష్టంగా పరిణమించింది. ఆ పాత్రను రామ్‌చరణ్ చెయ్యాలని చిరంజీవి భావించగా, ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ముగిసే దాకా మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనకూడదనే రాజమౌళి నిబంధనతో అది సాధ్యమయ్యేట్లు కనిపించలేదు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్‌ను మహేశ్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారంలోకి వచ్చింది. కొరటాల ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు దాన్ని చెయ్యడానికి అతను సుముఖత వ్యక్తం చేశాడు. అయితే మహేశ్‌ను ఆ పాత్ర కోసం అసలు సంప్రదించలేదని చిరంజీవి స్పష్టం చేశారు. అడ్డంకులు తొలగి రామ్‌చరణ్ ఆ క్యారెక్టర్ చెయ్యడానికి మార్గం సుగమమైంది.
మేకింగ్ పరంగా ఎంతటి ఆసక్తిని రేకెత్తిస్తున్నదో.. బిజినెస్ పరంగా అంతటి సంచలనాలు ‘ఆచార్య’ సినిమా సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితులు ఇప్పుడు ప్రతికూలంగా మారడంతో బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. అత్యధిక థియేటర్లలో ఈ సినిమాని విడుదల చెయ్యాలని సినిమా ప్రారంభించినప్పుడు నిర్మాతలు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో, తెరుచుకున్న థియేటర్లకు జనాలు ఏ రీతిన వస్తారో.. అనే సందేహాలు ఇండస్ట్రీకి సంబంధించిన అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. తెలుగు సినిమా పరిస్థితి కరోనాకి ముందు, కరోనాకి తర్వాత.. అనే లెక్కల్లోకి వెళ్లనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2021 జనవరికైనా ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు వస్తాడా? లేక సమ్మర్‌ని టార్గెట్ చేసుకుంటాడా? ఎవరూ చెప్పలేకపోతున్నారు.