Advertisement
Google Ads BL

టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, కోలీవుడ్‌లో స్థిర‌ప‌డ్డ ‘మ‌హా’ తార‌!


పూరి జ‌గ‌న్నాథ్ మూవీ ‘దేశ‌ముదురు’ (2007)తో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన పాల‌బుగ్గ‌ల సుంద‌రి హ‌న్సికా మొత్వానీ. ఆ మూవీలో స‌న్యాసిని అయిన క‌న్య‌గా అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించి యువ‌త‌రం గుండెల్లో గుబులురేపిన ఈ ముంబై ముద్దుగ‌మ్మ.. ఆ త‌ర్వాత టాలీవుడ్‌లో కాకుండా కోలీవుడ్‌లో సెటిల‌వ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే విష‌యం. బాలీవుడ్‌లో మొద‌ట హ‌వా, జాగో, కోయీ మిల్ గ‌యా సినిమాల్లో బాల‌న‌టిగా అల‌రించిన హ‌న్సిక.. ముంబైలోని పోడ‌ర్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో చ‌దువుకుంది. ఆమె ప‌దేళ్ల వ‌య‌సులో ఉండ‌గా ఆమెలోని న‌టిని త‌ల్లి క‌నిపెట్టింది. ‘‘ఇండ‌స్ట్రీలోని కొంత‌మంది వ్య‌క్తులు అమ్మ‌కు తెలుసు. అలా నా కెరీర్ బాల‌న‌టిగా మొద‌లైంది. ప‌ద‌మూడేళ్ల వ‌య‌సులో చ‌దువు కోసం కొంత బ్రేక్ తీసుకున్నా. ‘దేశ‌ముదురు’తో హీరోయిన్‌గా రీ-ఎంట్రీ అయ్యా’’ అని గుర్తు చేసుకుంటుంది హ‌న్సిక‌.
ఓ తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవ్వాల‌నేది ఆమె ఆలోచించి తీసుకున్న నిర్ణ‌య‌మే. పూరి జ‌గ‌న్నాథ్ గురించి విని ఉండ‌టం వ‌ల్ల ‘దేశ‌ముదురు’ చేసింది, మంచి పేరు తెచ్చుకుంది. ఏకంగా ‘బెస్ట్ ఫిమేల్ డెబ్యూ (సౌత్‌)’గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ స‌గ‌ర్వంగా అందుకుంది. దాని త‌ర్వాత వెంట‌నే తెలుగు సినిమాల ఆఫ‌ర్లు వ‌చ్చినా, వాటిని ప‌క్క‌న‌పెట్టి హిమేశ్ రేష‌మియాతో బాలీవుడ్‌లో ‘ఆప్ కా సురూర్’ సినిమా చేసింది. అయితే ఆమెను బాలీవుడ్ కంటే సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీయే ఎక్కువ‌గా ఆద‌రించింది. తెలుగులో వ‌రుస‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ మూవీ ‘కంత్రి’, రామ్ సినిమా ‘మ‌స్కా’, క‌ల్యాణ్‌రామ్ సినిమా ‘జ‌యీభ‌వ‌’, నితిన్ సినిమా ‘సీతారాముల క‌ల్యాణం.. లంక‌లో’ చేసింది. అయితే ఆ సినిమాలు ఆశించిన రీతిలో ఆడ‌లేదు.
అప్పుడు ధ‌నుష్ స‌ర‌స‌న ‘మాప్పిళ్లై’ (2011) చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డం ఆమె కెరీర్ దిశ‌ను మార్చేసింది. అదే పేరుతో ఒక‌ప్పుడు వ‌చ్చిన‌ ర‌జ‌నీకాంత్ సూప‌ర్‌హిట్ ఫిల్మ్‌కు రీమేక్ అయిన ఆ మూవీలో హ‌న్సిక అంద‌చందాలు, ఆమె అభిన‌యం త‌మిళుల‌కు తెగ నచ్చేశాయి. వ‌రుస‌గా త‌మిళ సినిమాల ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. అయిన‌ప్ప‌టికీ తెలుగు సినిమాలు పూర్తిగా మాన‌లేదు హ‌న్సిక‌. కందిరీగ‌, ఓ మై ఫ్రెండ్‌, దేనికైనా రెడీ సినిమాలు చేసింది. త‌మిళంలో బాగా బిజీ అవ‌డంతో అప్ప‌ట్నుంచీ తెలుగు సినిమాలు త‌గ్గించేసింది. పైగా త‌మిళ‌నాడులో ఆమెను దేవ‌త‌ను చేసి గుడి కూడా క‌ట్టించార‌య్యే. దాంతో త‌మిళ ప్రేక్ష‌కుల పిచ్చి ఆరాధ‌న‌కు త‌లొగ్గేసింది. ముంబైలో కంటే చెన్నైలోనే ఎక్కువగా ఉంటూ వ‌చ్చింది.
విజ‌య్‌, సూర్య‌, కార్తీ, ఆర్య‌, సిద్ధార్థ్‌, శివ కార్తికేయ‌న్‌, విశాల్‌, జ‌యం ర‌వి, శింబు, ఉద‌య‌నిధి స్టాలిన్‌, ప్ర‌భుదేవా, విక్ర‌మ్ ప్ర‌భు, అధ‌ర్వ వంటి సీనియ‌ర్ స్టార్లు, కుర్ర హీరోల‌కు జోడీగా న‌టిస్తూ ఇప్ప‌టికీ త‌న అస్తిత్వాన్ని చాటుకుంటూనే ఉంది. ఈ మ‌ధ్య కాలంలో ల‌క్కున్నోడు, గౌత‌మ్ నందా, తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్ వంటి తెలుగు సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం త‌మిళంలో ఆమె చేస్తోన్న ‘మ‌హా’ సినిమా కాంట్ర‌వ‌ర్సీ సృష్టించింది. ఇది ఆమె 50వ సినిమా కావ‌డం విశేషం. మ‌హారాజా చైర్‌లో కాషాయ వస్త్రాలు ధ‌రించి, హుక్కా పీల్చి పొగ వ‌దులుతూ ఉన్న ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌పై హిందూ సంఘాలు కొన్ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి.
వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే త‌మిళ న‌టుడు శింబుతో ఆమె ప్రేమ‌లో ప‌డింది. కొంత కాలం ఆ ఇద్ద‌రూ రిలేష‌న్‌షిప్‌లో ఉన్నార‌నీ, పెళ్లి కూడా చేసుకుంటార‌నీ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే శింబుతో త‌ను బ్రేక‌ప్ చేసుకున్నాన‌నీ, అత‌డిని ప్రేమించ‌డం త‌న జీవితంలో చేసిన పెద్ద త‌ప్ప‌నీ హ‌న్సిక ప్ర‌క‌టించడం సంచ‌ల‌నం సృష్టించింది. జీవితంలో మ‌రోసారి అలాంటి త‌ప్పు చేయ‌న‌ని కూడా ఆమె చెప్పింది. హ‌న్సిక‌ను శింబు ప్రేమించాడ‌నీ, అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌ని అత‌ను కండిష‌న్ పెట్టాడ‌నీ, అందుకే హ‌న్సిక బ్రేక‌ప్ చెప్పింద‌నీ శింబు తండ్రి టి. రాజేంద‌ర్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
CJ Advs

Hansika Introduced in Tollywood but settled in Kollywood:

Hansika 50th Film Mahaa in Controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs