టాలీవుడ్ హీరో గోపీచంద్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. లౌక్యం తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అందని ద్రాక్షలా మారిన విజయాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం సీటీమార్ అంటూ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రీడా నేపథ్యంగల సినిమాపై నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా కనిపిస్తుంది.
అయితే ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ అమ్మాయిల కబడ్డీ జట్టుకి కోచ్ గా కనిపించనున్నాడు. అటు తమన్నా.. తెలంగాణ అమ్మాయిల జట్టుకి కోచ్ గా కనిపించనుంది. ఇప్పటి వరకూ సగభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ని నిలిపివేసింది. అయితే చిత్రీకరణకి అనుమతులు లభించిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో సీటీమార్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న సమయంలో గోపీచంద్ రిస్క్ తీసుకుని మరీ సీటీమార్ షూటింగ్ కి వెళ్ళనున్నాడని అంటున్నారు. ఆగస్టు రెండవ వారం నుండి చిత్రీకరణ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కరోనా టైమ్ లో చాలా మంది హీరోలు రిస్క్ ఎందుకులే అని తమ చిత్రాల షూటింగులని వాయిదా వేసుకుంటున్న సమయంలో గోపీచంద్ సీటీమార్ సినిమా కోసం రిస్క్ తీసుకుంటాడేమో చూడాలి.