కరోనా కారణంగా థియేటర్లు మూతబడ్డాయి. మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సాధారణ పరిస్థితులు ఏర్పడి మళ్ళీ థియేటర్లో సినిమాలు చూస్తామా అన్న సందేహం కలుగుతుంది. అయితే కొన్ని దేశాల్లో ఇప్పటికే కరోనా ప్రభావం తగ్గి థియేటర్లు మళ్లీ తెరుచుకుంటున్న సమయాన కొద్దిగా ఆశాభావం వ్యక్తమవుతుంది. అయితే ప్రస్తుతానికి మనదేశంలో పరిస్థితులు మెరుగుపడాలంటే చాలా టైమ్ పట్టేలా ఉంది.
మరి అప్పటి వరకూ తమ సినిమాలని అలాగే ఉంచేసుకోవడం ఇష్టం లేని వారు ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. ఈ మేరకు బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే పెద్ద సినిమాలకి పేమెంట్ కూడా పెద్దగానే ఉంటుంది. అలా పెద్ద పేమెంట్ అందుకున్న చిత్రాల జాబితాల్లో మొదటి ప్లేస్ అందుకున్న చిత్రంగా అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ నిలవనుంది.
రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన కాంచనకి రీమేక్ గా తెరకెక్కింది. కాంచన సినిమాలో రాఘవ లారెన్స్ చేసిన పాత్రని అక్షయ్ కుమార్ చేసాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ద్వారా స్ట్రీమింగ్ అవనుంది. అయితే ఈ సినిమాని డిస్నీ హాట్ స్టార్ 125కోట్లు పెట్టి కొనుక్కుందని టాక్.
ఇప్పటి వరకూ ఓటీటీలో అమ్ముడైన సినిమాలన్నింటిలోకి ఇదే అత్యధికం అని చెబుతున్నారు. అయితే అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమాకి 125 కోట్లు కూడా తక్కువే అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వెర్షన్ ప్రకారం ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయితే 300కోట్లకి పైగా కలెక్ట్ చేసి ఉండేదని, అందుకే అప్పటిదాకా వెయిట్ చేసి ఉంటే బాగుండేదని సలహా ఇస్తున్నారు.