జగపతిబాబు జోరు తగ్గలేదు కానీ.. భారీ సినిమాలు లేవు!
చాలా కాలం తర్వాత ‘లెజెండ్’ మూవీతో జగపతిబాబు కెరీర్ స్పీడ్ అందుకుంది. అంతకు ముందు హీరోగా ఆయన క్లిష్ట స్థితిలో ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటిగా ఆయన సినిమాలు ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతూ వచ్చాయి. ఆ పరిస్థితుల్లో బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ‘లెజెండ్’.. ఆయన కెరీర్ దశ, దిశ.. రెండింటినీ మార్చేసింది. జితేంద్ర అనే కరడుకట్టిన కిరాతకుడి క్యారెక్టర్‌లో బాలకృష్ణకు సరైన విలన్ అనిపించాడు జగపతిబాబు. ఆ సినిమా తర్వాత నుంచీ ఒకవైపు విలన్‌గా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ, చేతినిండా సినిమా ఆఫర్లతో బిజీ అయిపోయాడు. హీరోగా ఎప్పుడూ లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకుంటూ వచ్చిన ఆయన లెజెండ్‌లో విలన్ రోల్ చేయడం కోసం కోటి రూపాయలు అందుకొని శభాష్ అనిపించాడు. నాన్నకు ప్రేమతో, జయ జానకి నాయక, రంగస్థలం, నేల టిక్కెట్టు, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి వంటి చిత్రాల్లో విలన్‌గా తన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించాడు.
వాటితో పాటే హీరో లేదా హీరోయిన్ ఫాదర్‌గా మంచి పాత్రలనూ ఆయన చేశాడు. అయితే మహేష్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విలన్ క్యారెక్టర్ తప్పిపోవడం ఆయనకు పెద్ద షాక్. మూడు నాలుగు రోజులు షూటింగ్‌లోనూ పాల్గొన్నాక.. ఆయనను తప్పించి, ఆ క్యారెక్టర్‌ను ప్రకాష్‌రాజ్‌తో చేయించారు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ విషయాన్ని బహిర్గతం చేసి, బాహాటంగానే తన ఆవేదనను వ్యక్తం చేశాడు జగపతి. ప్రకాష్‌రాజ్ స్వయంగా కోరడం వల్లే జగపతిని తప్పించి, ఆయనను తీసుకున్నారని తర్వాత కథనాలు వచ్చాయి.
అది గతం.. ఆశ్చర్యకరంగా జగపతిబాబుకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తప్పిపోయిన దగ్గర్నుంచీ ఇంతదాకా మరో భారీ సినిమాలో అవకాశం రాలేదు. నానితో ‘వి’, ‘టక్ జగదీష్’, కీర్తి సురేష్‌తో ‘మిస్ ఇండియా’, ‘గుడ్‌లక్ సఖి’, మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా పరిచయ చిత్రం వంటి సినిమాలే ఆయన చేస్తున్నాడు. అలాగే ఇతర భాషా సినిమాలూ ఆయన చేస్తున్నాడు. కన్నడంలో ‘పొగరు’, ‘రాబర్ట్’, తమిళంలో విజయ్ సేతుపతి సినిమా ‘లాబమ్’లో విలన్ రోల్స్ చేస్తున్నాడు జగపతి. చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మాణంలో ఉన్న ఏ ఒక్క భారీ సినిమాలోనూ ఆయన నటిస్తున్న జాడ కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప, వకీల్ సాబ్, విరూపాక్ష, నారప్ప, బీబీ3 తదితర చిత్రాలలో ఏ ఒక్కదానిలోనూ ఆయన నటించడం లేదు. హీరోగా డిమాండ్ లేకపోయినా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనలోని వెర్సటాలిటీని ప్రదర్శిస్తూ జోరు చూపించిన మన జగపతిబాబును భారీ సినిమాల దర్శకులూ, నిర్మాతలూ ఉపేక్షించడం సరికాదని ఫిల్మ్‌నగర్ జనాలు అభిప్రాయపడుతున్నారు.