Advertisement
Google Ads BL

టైటిల్ సినిమాకి స‌క్సెస్‌ని అందిస్తుందా?


ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి టైటిల్ బాగా దోహదం చేస్తుందని సినిమా రంగంలోని చాలామంది నమ్ముతారు. టైటిల్ అనేది సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పిస్తుంది కానీ, విజయానికి మొత్తంగా అదే దోహదం చేయదనీ, సినిమా కథలో పస లేకపోతే టైటిల్ ఎంత బాగున్నా, వింతగా వున్నా ఆ సినిమా నడవదనీ విశ్లేషకులు అనే దాంట్లో తప్పు కొంచెం కూడా లేదు. అయినప్పటికీ మన దర్శకులు తమ సినిమా టైటిళ్లను విభిన్నంగా పెట్టడానికే ప్రయత్నిస్తుంటారు.

Advertisement
CJ Advs

ఎవరన్నా కాస్త డబ్బులు ఖర్చు పెడుతూ సరదా చేసుకునే వాణ్ణి చూసి మనం ‘వాడికేంటిరా జల్సా పురుషుడు’ అంటుంటాం. అందులోని ‘జల్సా’ని టైటిల్‌గా పెట్టి సక్సెస్ సాధించారు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు. రెండక్షరాలతో చాలా సినిమాలే వచ్చాయి కానీ అన్నీ విజయం సాధించలేక పోయాయి. గత యేడాది నుంచి చూసుకుంటే యాత్ర‌, జెస్సీ, జెర్సీ, సీత‌, హిప్పీ, క‌ల్కి, సాహో, జోడి, ట్రాప్‌, జాను, భీష్మ‌, రాహు, హిట్‌.. వచ్చాయి. జెర్సీ, భీష్మ‌, హిట్ విజయం సాధించగా; ‘క‌ల్కి’ బాక్సాఫీసు వద్ద యావరేజ్ ముద్ర వేసుకుంది. యాత్ర‌, జెస్సీ, సీత‌, హిప్పీ, జోడి, ట్రాప్‌, జాను, రాహు సినిమాలు విఫలమయ్యాయి. ‘సాహో’ హిందీలో హిట్ట‌యి తెలుగులో ఫ్లాప‌యింది. తేజ తొలి చిత్రం ‘చిత్రం’ హిట్టవడంతో రెండక్షరాల టైటిల్‌కి అప్ప‌ట్నుంచే గిరాకీ ఏర్పడింది. ఖుషి, ఆది, జయం, ఇంద్ర, ఆర్య‌, ఢీ, రెడీ, మంత్ర‌, మిర్చి, ఫిదా, అ ఆ వంటి రెండ‌క్ష‌రాల సినిమాలు సూప‌ర్ హిట్ట‌య్యాయి.

టాప్ డైరెక్టర్లలో ఒకడైన పూరీ జగన్నాథ్ టైటిల్‌ని విభిన్నంగా పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఇట్లు.. శ్రావణీ సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, శివమణి 9848022338, ఏక్ నిరంజ‌న్‌, హార్ట్ ఎటాక్‌, ఇస్మార్ట్ శంక‌ర్‌ అంటూ అతడు వెరైటీగా పెట్టిన టైటిళ్లతో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. తిట్టుపదాలు ఇడియట్, పోకిరి, దేశముదురు టైటిళ్లతో బంపర్‌హిట్ సినిమాలు తీయడం అతడికే చెల్లింది.

తెలుగు సినిమాలకీ, యముడికీ మంచి అవినాభావ సంబంధం వుంది. ‘యమజాతకుడు’ వంటి ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే ‘యమ’ శబ్దంతో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా విజయం సాధించినవే. ‘యమగోల’, ‘యముడికి మొగుడు’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘యమలీల’, ‘యమదొంగ’, ‘యమగోల.. మళ్లీ మొదలైంది’ సినిమాలు విజయాన్ని చవిచూశాయి. అంటే యముడు బాక్సాఫీసు మంత్రమన్నమాట.

ఆహ్లాదకరమైన పేర్లు పెడితే ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు పొలోమని వస్తారనేది చాలామంది భావన. కానీ ఆ తరహా టైటిల్స్‌తో వచ్చిన సినిమాల్లో అత్యధికం ప్రేక్షకుల తిరస్కారానికి గురవడం విచారకరం. టైటిల్‌లో వున్న ఆహ్లాదం సినిమాలో లేకపోవడమే దానికి కారణం. బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ‘విన‌య విధేయ రామ‌’, ఆది సాయికుమార్ హీరోగా రైట‌ర్‌ డైమండ్ ర‌త్న‌బాబు డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతూ తీసిన ‘బుర్ర‌క‌థ‌’, రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున టైటిల్ రోల్ చేసిన ‘మ‌న్మ‌థుడు 2’, రాజేంద్ర‌ప్ర‌సాద్, ఐశ్వ‌ర్యా రాజేశ్‌ తండ్రీ కూతుళ్ల‌గా న‌టించిన ‘కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’, శ్రీ‌నివాస‌రెడ్డి డైరెక్ట్ చేసిన ‘భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు’, స‌తీశ్ వేగేశ్న డైరెక్ష‌న్‌లో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ న‌టించిన ‘ఎంత మంచివాడ‌వురా’, న‌లుగురు నాయిక‌ల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ రొమాన్స్ చేసిన ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’, బ్ర‌హ్మాజీ కుమారుడు సంజ‌య్ రావు హీరోగా ప‌రిచ‌య‌మైన ‘ఓ పిట్ట‌క‌థ‌’ వంటివి తుస్సుమన్నాయి.

కొన్ని సినిమాలు టైటిళ్లకు విరుద్ధమైన ఫలితాల్ని పొంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేయడం గమనించదగ్గ అంశం. ‘య‌న్‌.టి.ఆర్‌: క‌థానాయ‌కుడు’, ‘మ‌హానాయ‌కుడు’ బాక్సాఫీసు వ‌ద్ద ప‌రాజితుల‌య్యారు. రామ్‌గోపాల్ వ‌ర్మ ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ సిరులు కురిపించలేక పోయాడు. క‌న్న‌డ హిట్ మూవీకి రీమేక్‌గా వ‌చ్చిన ‘ఫ‌స్ట్ ర్యాంక్ రాజు’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల‌య్యాడు. మంచు విష్ణు ‘ఓట‌ర్‌’కు ప్రేక్ష‌కుల నుంచి డిపాజిట్లు ద‌క్క‌లేదు. నాగార్జున వ‌దిలిన ‘మ‌న్మ‌థుడు 2’ బాణం గురి త‌ప్పి చిత్త‌య్యింది. నాని ‘గ్యాంగ్ లీడ‌ర్’ బాక్సాఫీస్ లీడ‌ర్ కాలేక‌పోయాడు. గోపీచంద్ ‘చాణక్య’ తెలివితేట‌లు ప్రేక్ష‌కుల వ‌ద్ద ప‌నికిరాలేదు. సాయికిర‌ణ్ అడివి ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌’ను ఆడియెన్స్ ఐర‌న్ ఫిష్ చేశారు. శ్రీ‌విష్ణు ‘తిప్ప‌రా మీసం’ అన్నాడు కానీ, నిర్మాత మీసం గొరిగించుకోవాల్సి వ‌చ్చింది. బాల‌కృష్ణ ‘రూల‌ర్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బేర్‌మ‌న్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ అవుదామ‌నుకుంటే, ఆఖ‌రుకి వ‌ర‌ల్డ్ వ‌ర‌స్ట్ ల‌వ‌ర్‌గా మిగ‌లాల్సి వ‌చ్చింది.

అంటే చిత్ర విజయానికి టైటిల్ అనేది ఒక ప్లస్ పాయింట్‌గా మాత్రమే వుంటుందనీ, కేవలం టైటిల్ వల్లే సినిమా హిట్టు కాదనీ స్పష్టమవుతుంది. మంచి కథతో సినిమాని రూపొందించి, దానికి జస్టిఫై అయ్యే టైటిల్‌ని పెడితే ఆ సినిమా తప్పనిసరిగా ఆడుతుందనడంలో సందేహం లేదు. అందుచేత కథకులూ, దర్శకులూ టైటిల్ కంటే ముందు కథకీ, స్క్రీన్‌ప్లేకీ ప్రాధాన్యతనిచ్చి వాటిమీద శ్రద్ధ చూపి, ఆ తర్వాత టైటిల్ గురించి ఆలోచించడం బెటరు.

Is title gives success to Movie?:

Tollywood Movies Titles and results
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs