అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తర్వాతి చిత్రం విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ గా నిలిచిన సందీప్, ఆ తర్వాత అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి, అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఈ చిత్రం షాహిద్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇందులో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీని బాలీవుడ్ లో బిజీ అయ్యేలా చేసింది. అయితే కబీర్ సింగ్ తర్వాత బాలీవుడ్లో సినిమా చేస్తానన్న సందీప్, రణ్ బీర్ కపూర్ కి కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. డెవిల్ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుందని అన్నారు. అయితే ఏమైందో ఏమోగానీ ఆ సినిమా గురించి మళ్లీ ఎలాంటి మాటలు మాట్లాడలేదు. దాంతో సందీప్, ప్రభాస్ కి కథ వినిపించాడని, మహేష్ తో కమిట్ అయ్యాడని రకరకాల కథనాలు వెలువడ్డాయి.
అయితే తాజాగా మళ్లీ సందీప్ తర్వాతి చిత్రం గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడు చర్చల దశలో మిగిలిపోయిన డెవిల్ చిత్రమే మళ్ళీ ఓకే అయిపోయినట్లు, సందీప్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రణ్ బీర్ కపూర్ ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ మరికొన్ని రోజుల్లో రానుందా లేదా సస్పెన్స్ ఇంకా ఇలానే కొనసాగనుందా చూడాలి.