లఘుచిత్రాల ద్వారా పాపులర్ అయ్యి, ఆ తర్వాత వెండితెరపై హీరోగా అవకాశాన్ని తెచ్చుకున్న రాజ్ తరుణ్, తన మొదటి సినిమా ఉయ్యాలా జంపాలాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి చక్కటి శుభారంభం దొరికింది. ఆ తర్వాత సుకుమార్ రాసిన కుమారి 21 ఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. కుమారి 21 ఎఫ్ తర్వాత ఎన్నో సినిమాలు చేసినా ఏదీ సరైన గుర్తింపుని తీసుకురాలేదు. అదీగాక వరుసగా వైఫల్యాలు ఎదుర్కుంటూ వస్తున్నాడు. మొన్నటికి మొన్న ఇద్దరిలోకం ఒకటే సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ దక్కించుకున్నాడని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ కి మంచి హిట్ అవసరం. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూతబడ్డాయి.
దీంతో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన చిత్రం ఒరేయ్ బుజ్జిగా చిత్రం ఓటీటీ ద్వారా విడుదల కానుందని అంటున్నారు. లాక్డౌన్ మొదట్లో ఇలాంటి వార్తలు వచ్చినపుడు చిత్ర యూనిట్ ఖండించింది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కరోనా వల్ల థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియకుండా ఉంది. థియేటర్లు తెరుచుకునే వరకూ వెయిట్ చేయడం కంటే, ఓటీటీలో రిలీజ్ చేసుకోవడమే బెటర్ అని భావిస్తున్నారట. మరి ఈ విషయమై చిత్రబృందం మరికొద్ది రోజుల్లో స్పందిస్తుందని చెబుతున్నారు.
అయితే దీనివల్ల రాజ్ తరుణ్ కి నష్టం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. థియేటర్లలో అయితే ఆయన మార్కెట్ ఏంటో తెలిసి ఉండేదని, సినిమా హిట్ అయితే గనక మరిన్ని ఆఫర్లు వస్తాయని.. ఓటీటీలో అలాంటి అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు.