టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ అనే విశేషణం జోడించేది ఒక్క కృష్ణవంశీకే. అయితే అది గతమని ఇప్పుడంతా ఒప్పేసుకుంటున్నారు. ఆయనలోని క్రియేటివిటీ ఎప్పుడో మసకబారిందనేది చాలా మంది అభిప్రాయం. చాలా కాలంగా ఆయన ప్రేక్షకాదరణ పొందే సినిమాని తీయలేకపోతున్నాడని వారంటారు. ఇది కేవలం అభిప్రాయం కాదు. ఆయన కెరీర్‌ని విశ్లేషిస్తే బోధపడే సత్యం.
బీయస్సీ చదివి, ఆగ్రా యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో ఎంఏ పట్టా పుచ్చుకున్న కృష్ణవంశీ సినీ కెరీర్ లైట్ బాయ్ నుంచి మొదలుపెట్టడం ఆశ్చర్యమనిపిస్తుంది కానీ, సినిమాపై ఆయనకున్న తపన ఎలాంటిదో అది తెలియజేస్తుంది. కెమెరా అసిస్టెంట్‌గా, అసిస్టెంట్ ఎడిటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ మనీ మనీ సినిమాకి ఘోస్ట్ డైరెక్టర్‌గా పనిచేసి, తన పనితనాన్ని ప్రదర్శించాడు. 1995లో ‘గులాబీ’తో డైరెక్టర్‌గా అందరికీ పరిచయమయ్యాడు. జె.డి. చక్రవర్తిని హీరోగా నిలిపిన ఆ సినిమాతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు.
ఇక రెండో సినిమా అయితే దర్శకుడిగా ఆయన్ని టాప్ స్లాట్‌లో నిలిపింది. అది - ‘నిన్నే పెళ్లాడుతా’. నాగార్జున, టబు జంటకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి వాళ్ల క్యారెక్టర్స్‌ని అలా మౌల్డ్ చేసిన కృష్ణవంశీ క్రియేటివిటీయే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంత బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా చేశాక తెలివైన డైరెక్టర్, ఎకనామిక్స్ తెలిసిన డైరెక్టర్ అయితే ఏం చేసేవాడు? కచ్చితంగా మరో స్టార్ హీరోతో సినిమా చేసి, టాప్ డైరెక్టర్‌గా నిలవడానికి కృషి చేసేవాడు. కానీ కృష్ణవంశీకి ఈ ఎకనామిక్స్ మీద ఏమాత్రం ఆసక్తి లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో డైరెక్టర్‌గా తనలోని తపనని తీర్చుకోవడం మీదే ఆయన దృష్టంతా. అందుకే ‘సిందూరం’ తీశాడు. హీరో పక్కనో, విలన్ పక్కనో ఉండే చిన్న చిన్న పాత్రలు చేస్తూ పొట్టపోసుకుంటున్న బ్రహ్మాజీని హీరోని చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చురుగ్గా పనిచేస్తున్న యువకుడు రవితేజను సైడ్ హీరోగా మార్చాడు. నక్సలిజం మీద తనదైన దృక్పథంతో ఆయన చేసిన ఆ సినిమా డైరెక్టర్‌గా ఆయనకు పేరైతే తీసుకొచ్చింది కానీ, కమర్షియల్‌గా ప్రయోజనం కలిగించలేకపోయింది.
దాని తర్వాత నాగార్జునతో చేసిన రీమేక్ మూవీ ‘చంద్రలేఖ’ డిజాస్టరయ్యింది. అయితే బౌన్స్‌బ్యాక్ అన్నట్లుగా ‘అంతఃపురం’ చిత్రంతో సత్తా చూపాడు. అది ఆయనకు తృప్తినివ్వడమే కాకుండా పేరునీ తీసుకొచ్చింది. ఫ్యాక్షనిజాన్ని ఆయన చూపించిన తీరు విమర్శకుల్ని మెప్పించింది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా తీసిన ‘సముద్రం’ మరో డిజాస్టర్. అది బ్లాక్‌బస్టర్ అవుతుందని కృష్ణవంశీ ఎంతగానో ఆశించాడు. మరో ‘ఖైదీ’ అవుతుందనుకున్నాడు. కాలేదు. దాని తర్వాత ‘మురారి’తో సంతృప్తి చెందాడు. ఈ సినిమాలో మహేష్‌లోని నటుడ్ని బయటకు తీశాడు. అయితే వ్యక్తిగా కృష్ణవంశీలోని మార్పుకు ఈ సినిమా నాంది. అప్పటివరకూ రేఖామాత్రంగా ఆయనలో కనిపిస్తూ వచ్చిన ఆధ్యాత్మిక దృష్టి ఈ సినిమా నుంచీ క్రమక్రమంగా ఉధృతమవుతూ వచ్చింది.
‘ఖడ్గం’ మూవీని నేరుగా మతం మీదే తీశాడు. పైకి దేశభక్తి సినిమాగా కనిపించినా, ఇందులో ఒక మతాన్ని కించపరిచే అంశాలున్నాయని, ఆ మతంవారు ఆందోళన చేశారు. ఫలితంగా అది వివాదాస్పద చిత్రమైంది. ఆ సినిమా వచ్చింది 2002లో. అప్పట్నుంచీ ఇప్పటిదాకా అంటే ఈ పద్దెనిమిదేళ్ల కాలంలో ఆయన తీసిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే జనాదరణ పొందింది. అది.. 2007లో వచ్చిన ‘చందమామ’. ‘‘శ్రీ ఆంజనేయం, చక్రం, డేంజర్, రాఖీ, శశిరేఖా పరిణయం, మహాత్మా, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం’’ సినిమాలు ప్రేక్షకుల్ని ఆశించిన రీతిలో అలరించలేకపోయాయి. సహజ పాత్రలు, సహజ సన్నివేశాలు లేకపోయినా అవి తగినంత వినోదాన్ని అందించినప్పుడే ప్రేక్షకులు వాటితో మమేకమవుతారు. ఈ విషయంలోనే ఆయన ఫెయిలవుతున్నాడు. ఆయన కథలు, ఆయన క్రియేట్ చేస్తున్న క్యారెక్టర్లు, సీన్లు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం లేదు. ఆయన క్రియేట్ చేస్తున్న క్యారెక్టర్లలో ఆడియెన్స్ తమని తాము చూసుకోలేకపోతున్నారు.
ఇప్పుడాయన ‘రంగమార్తాండ’ అనే సినిమాని రూపొందిస్తున్నాడు. నానా పటేకర్ టైటిల్ రోల్ చేయగా మరాఠీలో సూపర్ హిట్టయిన ‘నటసమ్రాట్’ సినిమాకు ఇది రీమేక్. ప్రకాష్‌రాజ్‌తో ఈ మూవీని తీస్తున్నాడు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాతో ‘బిగ్ బాస్ 3’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ నటుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఏదేమైనా 57 ఏళ్ల కృష్ణవంశీలోని క్రియేటివిటీకి ‘రంగమార్తాండ’ గట్టి సవాలుగా నిలుస్తోంది. తను నిజంగా క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకోవాలంటే ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిందే. లేకపోతే ఇప్పటికే మసకబారిన ఆయన ఖ్యాతి మరింత దిగజారిపోతుందనేది నిజం.