మన్మధుడు 2 సినిమా ఫ్లాప్ తర్వాత సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వైల్డ్ డాగ్ సినిమాపై నాగార్జున చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాలొ ఎన్ ఐ ఏ అధికారిగా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనంతరం నాగార్జున ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడనేది ఆసక్తిగా మారింది. ఎల్ బీ డబ్ల్యూ సినిమా ద్వారా తానేంటో ప్రూవ్ చేసుకుని, చందమామ కథలు, గుంటూర్ టాకీస్, గరుడవేగ వంటి వైవిధ్యమైన చిత్రాలని తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. నా రాత నేనే రాసుకుంటా అనే టైటిల్ తో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా సినిమా రూపొందుతుందని అంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంటుగా కనిపించనున్నాడట. ప్రఖ్యాత డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన ఏషియన్ సినిమాస్ నిర్మాతగా వ్యవహరించనుందని సమాచారం.
మరి ఈ విషయమై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి కోవిడ్ 19 వల్ల వైల్డ్ డాగ్ చిత్రీకరణ కూడా ఆగిపోయింది. అన్నీ కుదురుకుని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా రూపొందుతుందో చూడాలి.