కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై చాలా రోజులు కొనసాగేలా ఉంది. రోజు రోజుకీ కోవిడ్ విజృంభణ పెరుగుతుండడంతో సాధారణ పరిస్థితులు ఇప్పట్లో వచ్చేలా లేవు. దీంతో సినిమా పరిశ్రమ మునుపెన్నడూ లేని ఒడుదుడుకులను ఎదుర్కుంటుంది. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు హీరోల నుండి మొదలుకుని ప్రతీ ఒక్కరి పారితోషికాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పారితోషికాలు తగ్గించుకోకుంటే సినిమా నిర్మాణం కష్టంగా మారనుంది. అందుకే అందరూ తమ తమ పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే. ఈ విషయమై ఒక్కొక్కరుగా పారితోషికాలు తగ్గించుకోవడానికి ముందుకు వస్తున్నారు. మహానటి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుని, జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్, భవిష్యత్తులో తాను చేయబోయే సినిమాల రెమ్యునరేషన్ లో 30శాతం తగ్గించుకుంటుందట.
ఆగస్టు నుండి సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్న కీర్తి ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించి నిర్మాతలకి భారాన్ని తగ్గించింది. మరి కీర్తి బాటలోకి ఇంకెంత మంది వస్తారో చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం ఈ నెల 19వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవనుంది.