పరిస్థితులు మామూలుగా ఉన్నట్లయితే ఈసరికి ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ఆడుతూ ఉండాల్సిన ‘ఉప్పెన’, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమాలు సంగీతపరంగా సంచలనం సృష్టిస్తున్నాయి. టీవీ యాంకర్‌గా పాపులర్ అయిన ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ దాటి, ఆ ఫీట్ సాధించిన తొలి చిన్న సినిమా పాటగా చరిత్ర సృష్టించింది. ఈ పాటకు బాణీలు కట్టింది అనూప్ రూబెన్స్. అలాగే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు అయిన పంజా వైష్ణవ్‌తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘ఉప్పెన’ చిత్రంలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట 70 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సాంగ్‌కు ట్యూన్స్ కట్టింది దేవి శ్రీప్రసాద్. ఈ రెండు సినిమాలకు ఉన్న సారూప్యత.. లవ్ స్టోరీ! ఆ సినిమాలు రెండూ డెబ్యూ హీరోలవే. ఈ ఎపిసోడ్ మరోసారి చర్చకు తెచ్చిన అంశం ఏమంటే టాలీవుడ్‌లో ఎక్కువ మంది తారలు తమ పరిచయ చిత్రాలుగా ప్రేమకథల్నే ఎందుకు ఎంపిక చేసుకుంటారు లేదా ప్రేమకథా చిత్రాలతోనే హీరో హీరోయిన్లుగా పరిచయం కావాలని ఎందుకు కోరుకుంటారు.. అనేది.
మాస్‌లో అసాధారణ ఇమేజ్ ఉన్న స్టార్లు మినహాయిస్తే మిగతా హీరోలు చేసే సినిమాల్లో కథాంశం ప్రేమ ప్రధానంగా ఉండటం గమనించవచ్చు. ప్రేమ భావనకు ఉండే సార్వజనీనత, సార్వకాలీనత అనే భావాలు ప్రేమ కథలను దర్శక నిర్మాతలు తమ సినిమాకు మూలాంశాలుగా ఎంపిక చేసుకోవడానికి దారితీస్తున్నాయని చెప్పాలి. అయితే టాలీవుడ్‌లో అజరామరమైన ప్రేమకథలెన్నెన్నో. దేవదాసు, లైలా మజ్ను, అనార్కలి, ఆరాధన, మరో చరిత్ర, సీతాకోకచిలక, మేఘసందేశం, గీతాంజలి, అభినందన, ప్రేమ, తొలిప్రేమ, 7జి బృందావన కాలని, ఆనంద్, ఏ మాయ చేశావే, బొమ్మరిల్లు వంటివి వాటిలో కొన్ని. యంగ్ జనరేషన్‌లోని యువతీ యువకుల మధ్య ఉండే నిస్వార్థ ప్రేమ, కులమతాలు-అంతస్థులు చూడని, హద్దులెరుగని ప్రేమ భావనను కె. బాలచందర్ ‘మరో చరిత్ర’లో అద్భుతంగా ఆవిష్కరించాడు. కమల్ హాసన్, సరిత జంటగా నటించిన ఈ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త ప్రేమకథలకు నాందిగా నిలిచింది.
తెలుగులో అలా ప్రేమకథలతో పరిచయమైన తారల లిస్ట్‌పై ఓ లుక్కేస్తే...
సరిత - మరో చరిత్ర
కార్తీక్, ముచ్చర్ల అరుణ - సీతాకోక చిలుక
గిరిజ - గీతాంజలి
రాఘవ - మహర్షి
శరణ్య - నిరీక్షణ
పవన్ కల్యాణ్, సుప్రియ - అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
దేవయాని - సుస్వాగతం
ఉదయ్ కిరణ్, రీమా సేన్ - చిత్రం
తరుణ్, సాయికిరణ్, రిచా పల్లాడ్ - నువ్వే కావాలి
నితిన్, సదా - జయం
ఆర్తీ అగర్వాల్ - నువ్వు నాకు నచ్చావ్
అనిత - నువ్వు నేను
సుమంత్, అంతరమాలి - ప్రేమకథ
కమలినీ ముఖర్జీ - ఆనంద్
రవికృష్ణ, సోనియా అగర్వాల్ - 7జి, బృందావన కాలని
రామ్, ఇలియానా - దేవదాసు
అను అగర్వాల్ - ఆర్య
సిద్ధార్థ్ - నువ్వొస్తానంటే నేనొద్దంటానా
సమంత - ఏ మాయ చేశావే
లావణ్యా త్రిపాఠి, నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ - అందాల రాక్షసి
నిత్యా మీనన్ - అలా మొదలైంది
సాయిధరమ్ తేజ్ - పిల్లా నువ్వులేని జీవితం