కరోనా తాకిడి ఇంకా హైదరాబాద్ ని చేరకముందే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్ అనిపించుకున్న చిత్రం నితిన్ నటించిన భీష్మ.. దాదాపు అన్ సీజన్ గా చెప్పబడే టైమ్ లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నప్పటికీ, బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమా హిట్ దగ్గరే ఆగిపోయిందని చాలా మందికి అనిపించింది. ఏదైతేనేం మొత్తానికి నితిన్ కి మంచి సక్సెస్ వచ్చింది. అయితే ప్రస్తుతం నితిన్ చేతిలో రెండు సినిమాలున్నాయి.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే ఒకటి కాగా మరొకటి బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాధున్ తెలుగు రీమేక్. అంధాధున్ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కూడా కాలేదు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అయితే రంగ్ దే సినిమా ఇప్పటి వరకు సగభాగం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఆల్రెడీ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుండి మొదలు కానుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం చివరికల్లా రెండు సినిమాలని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రభుత్వం షూటింగులకి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆగస్టు నుండి షూట్ మొదలుపెట్టాలని నితిన్ భావిస్తున్నాడట.