లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి నుండి కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతూ కరోనా బారిన పడుతున్నారు. ఈ విషయంలో ఎవరిని నిందించాలనేది అంతు పట్టని అంశం. అయితే తాజాగా చిత్ర దర్శకుడు తేజ, కరోనా గురించిన లెక్కలు చెప్పి అందరినీ భయపెడుతున్నాడు. ప్రస్తుతం కరోనా కేసుల విషయంలో నాలుగవ స్థానంలో ఉన్న ఇండియా మరో కొద్దిరోజుల్లోనే మొదటి స్థానానికి ఎగబాకుతుందని చెబుతున్నాడు.
జనాల నిర్లక్ష్యం వల్ల కరోనా మహమ్మారి రోజు రోజుకీ పెరుగుతూనే ఉందని, నాకు కరోనా లేదు, నేను కలిసే వాళ్లకి కరోనా లేదు అన్న మైండ్ సెట్ వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నాడు. కూరగాయలు కొన్నా, బయట నుండి ఏ వస్తువు తెచ్చినా ఖచ్చితంగా శానిటైజ్ చేయాలని , లేదంటే రోజుకి లక్ష కేసుల దాకా పెరిగి, త్వరలోనే రెండు కోట్ల కేసులు నమోదవుతాయని అంటున్నాడు.
జనాల్లో కరోనా పట్ల భయం తగ్గిపోయిందని, అందువల్లే కేసులు పెరుగుతున్నాయని అన్నాడు. ఇలాగే ఉంటే మనం అదుపుచేయలేని పరిస్థితులు ఏర్పడుతాయని అంటున్నాడు.