కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ కొట్టింది. టాలీవుడ్‌లో ఇప్పటిదాకా వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. పూర్తయిన సినిమాల విడుదలలు అనివార్యంగా వాయిదా పడ్డాయి. సెట్స్ మీదున్న సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. ఇక కొత్త సినిమాల ప్లానింగ్‌లు కూడా వాయిదా పడ్డాయి. 2020 సంక్రాంతికి విన్నర్స్‌గా నిలిచిన ఇద్దరు దర్శకుల పరిస్థితి ఒకే విధంగా ఉండడం గమనించదగ్గ అంశం. ఆ ఇద్దరు దర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి. త్రివిక్రమ్ మూవీ ‘అల.. వైకుంఠపురములో’, అనిల్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.. వాళ్ల కెరీర్‌లోనే కాకుండా ఆ సినిమాల హీరోలైన అల్లు అర్జున్, మహేశ్ కెరీర్‌లలోనూ బిగ్గెస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి.
వాటి తర్వాత ఆ ఇద్దరు దర్శకులు తమ తదుపరి సినిమాలపైన దృష్టి పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్, వెంకటేశ్-వరుణ్‌తేజ్‌తో ‘ఎఫ్3’ మూవీకి అనిల్ కమిటయ్యారు. అయితే ఆ హీరోలు ఇప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో అవి పూర్తయ్యాకే మరో సినిమా చేయడానికి అవకాశం ఉంది. తారక్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్నాడు. కరోనా, లాక్‌డౌన్ గోల లేకపోయినట్లయితే ఆగస్ట్ నాటికి తారక్ ‘ఆర్ఆర్ఆర్’ను పూర్తి చేసి, త్రివిక్రమ్‌తో సినిమాకి సిద్ధమై ఉండేవాడు. ఇప్పుడు ఆ ప్లాన్ తారుమారైంది. లాక్‌డౌన్ కారణంగా తారక్ పుట్టినరోజుకు కూడా అతని క్యారెక్టర్ టీజర్ కాదు కదా, కనీసం అతని ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేయలేకపోయాడు డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడు తారక్ పోర్షన్ ఎప్పడు ఫినిష్ అవుతుందో కచ్చితంగా చెప్పలేని స్థితి ఉంది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కోసం ఈ ఏడాది చివరి దాకా త్రివిక్రమ్ ఆగాల్సిందే.
అనిల్ రావిపూడిది కూడా సేమ్ టు సేమ్ ఇదే స్థితి. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ‘ఎఫ్3’ మూవీ చేస్తానని ఇదివరకే అతను తెలిపాడు. ఇందులోనూ ‘ఎఫ్2’ హీరోలు వెంకటేశ్, వరుణ్‌తేజ్ నటించనున్నారు. అయితే వెంకటేశ్ ‘నారప్ప’ మూవీతో బిజీగా ఉండగా, కిరణ్ కొర్రపాటి అనే డెబ్యూ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడు వరుణ్. నిజానికి ఈ సినిమాలు రెండు జూలై, ఆగస్ట్ నెలల్లోగా రిలీజ్ కావాల్సి ఉంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు విఘాతం ఏర్పడటంతో వాటి విడుదలలు వాయిదా పడ్డాయి. సినిమా హాళ్లు తెరుచుకొని, జనం స్వేచ్ఛగా సినిమాలు చూడ్డానికి వచ్చేంతవరకూ అవి విడుదలయ్యే అవకాశం లేదు. అంటే వెంకటేశ్, వరుణ్ తేజ్.. ఇద్దరూ ఈ ఏడాది చివరి నాటికి గానీ ‘ఎఫ్3’ చేయడానికి అందుబాటులోకి రారని తెలుస్తోంది. అయితే ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ప్రకాశం జిల్లాలోని సొంతూరుకు వెళ్లిన అనిల్.. అక్కడ మరో కథను రెడీ చేసేశాడు. వీలైతే ‘ఎఫ్3’ చేయడానికంటే ముందుగా మరో హీరోతో ఇంకో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అతని ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాల్సిందే.