రాజకీయ నాయకుల కొడుకులు ఎలాగైతే రాజకీయాల్ని వారసత్వంగా తీసుకొని వస్తుంటారో.. సినిమా రంగంలోనూ అదే విధంగా వారసత్వం కొనసాగుతూ రావడం ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఇప్పటి దాకా చూస్తూనే ఉన్నాం. దగ్గుబాటి కుటుంబం విషయానికి వస్తే.. నిర్మాత డి. రామానాయుడు వారసత్వాన్ని ఆయన కుమారులు సురేశ్‌బాబు, వెంకటేశ్ కొనసాగించారు. తండ్రి మార్గంలో పెద్ద కుమారుడు సురేశ్ నిర్మాతగా మారగా, చిన్నకుమారుడు వెంకటేశ్ హీరోగా పరిచయమై, క్రమేణా టాప్ స్టార్స్‌లో ఒకరిగా ఎదిగారు.
తర్వాతి తరంలో సురేశ్ పెద్దకుమారుడు రానా సైతం మొదట ‘బొమ్మలాట’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించి, తర్వాత బాబాయ్‌ను అనుసరిస్తూ నటుడిగా మారాడు. ఇవాళ రానా గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరికీ తెలుసు. ‘బాహుబలి’లో భల్లాలదేవ పాత్రలో గొప్పగా రాణించి, తనదైన ముద్ర వేశాడు. త్వరలో రానా తమ్ముడు అభిరామ్ కూడా నటుడిగా పరిచయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా అతని ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇదే తరహాలో వెంకటేశ్ కుమారుడు అర్జున్ కూడా సినిమాల్లోకి వస్తాడా?.. ఈ ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ఇంకా టీనేజ్‌లో ఉన్న అర్జున్ హైట్‌లో తండ్రిని మించి పోయాడు. మున్ముందు రానా హైట్‌ను అందుకోవడం ఖాయం. ఇటీవల రానా, మిహీకా ఎంగేజ్‌మెంట్ వేడుకలో పాల్గొన్న అర్జున్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో అతడి ఎంట్రీ గురించి జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే ఇప్పట్లో అర్జున్ సినిమాల్లో అడుగుపెట్టే అవకాశం లేదని అతని పెదనాన్న సురేశ్‌బాబు తేల్చేశారు. తనకు తెలిసినంతవరకు ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్తాడని ఆయన చెప్పారు. ఆ చదువు పూర్తి చేసుకొని వచ్చాకే అతడేం చేస్తాడనేది తెలుస్తుందని ఆయన అన్నారు. ఇప్పటివరకూ అర్జున్ సినిమా ఎంట్రీ గురించి తమ కుటుంబంలో చర్చ జరగలేదనీ, అతనిదింకా చదువుకొనే వయసేననీ సురేశ్‌బాబు చెప్పారు. అయినా తమ కుటుంబంలో ఎవరేం చేయాలనే విషయంలో బలవంతం పెట్టమనీ, తామేం కావాలనుకుంటారనేది వాళ్లే నిర్ణయించుకుంటారనీ సురేశ్‌బాబు అన్నారు.
ఈ సందర్భంగా రానా విషయంలో ఏం జరిగిందో ఆయన చెప్పకొచ్చారు. ‘‘రానా చదువు పూర్తయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ పెట్టాడు. కొంత కాలం తర్వాత దాన్ని మూసేశానని చెప్పాడు. ఏం చెయ్యాలో చెప్పమన్నాడు. సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ కావచ్చనీ, డైరెక్టర్‌వి ఎందుకు కాకూడదనీ అన్నాను. తాను యాక్టర్‌ని అవుతానన్నాడు. అప్పుడు లావుగా ఉండేవాడు. తనే విదేశాలకు వెళ్లి ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లీడర్’ చేశాడు’’ అని వివరించారు సురేశ్‌బాబు.