టాలీవుడ్‌లో ప్రస్తుతం పిరియాడికల్ ఫిల్మ్స్ ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్స్ నుంచి రైజింగ్ హీరోస్ వరకు అందరి చూపు ఈ తరహా చిత్రాల వైపు ఉంది. మరీ ముఖ్యంగా.. మెగా కాంపౌండ్‌లో దాదాపు ప్రతి హీరో ఈ జానర్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘సుప్రీమ్’ హీరో సాయితేజ్ వరకు అందరి చూపు పీరియడ్ ఫిల్మ్ వైపు ఉండడం విశేషం.
చరిత్రకు కొన్ని ఊహాజనిత పాత్రలు, ఘట్టాలు జోడించి రూపొందించే ఈ పిరియడ్ ఫిల్మ్స్‌లో ఇప్పటివరకు చిరంజీవి, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ నటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఈ తరహా సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు.. ఇప్పుడు ఈ జాబితాలోనే సాయితేజ్ కూడా ఓ పిరియడ్ ఫిల్మ్ చేయనున్నాడని టాక్.
చారిత్రక కథతో 2015లో వచ్చిన ‘రుద్రమదేవి’లో గోనా గన్నారెడ్డిగా బన్నీ ముఖ్య పాత్ర పోషిస్తే.. అదే ఏడాది విడుదలైన మరో పీరియడ్ మూవీ ‘కంచె’లో వరుణ్ నటించాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ సోల్జర్ క్యారెక్టర్‌లో పలకరించాడు. ఇక గత ఏడాది జనం ముందుకు వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’లో తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా దర్శనమిచ్చారు మెగాస్టార్.
అలాగే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో పీరియడ్ ఫిల్మ్ ‘ఆర్ ఆర్ ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుంటే.. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ (‘విరూపాక్ష’ అనేది పరిశీలనలో ఉన్న టైటిల్) రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్‌లో పవన్ కనిపించనున్నాడు. మొఘలాయిల పాలన నేపథ్యంతో పవన్ - క్రిష్ కాంబో మూవీ తెరకెక్కుతోందని టాక్. అలాగే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో సాయితేజ్ కూడా ఓ పీరియడ్ ఫిల్మ్ చేయబోతున్నాడనీ.. వీరు పోట్ల ఈ సినిమాని తీర్చిదిద్దనున్నాడనీ కొంత కాలం క్రితం ప్రచారంలోకి వచ్చింది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానున్నది.
ఏదేమైనా మెగా కాంపౌండ్‌లో పీరియడ్ ఫిల్మ్స్ ట్రెండ్ భలేగా ఊపందుకుంటోంది. అయితే, ఇప్పటివరకు ఈ తరహా చిత్రాలేవీ ఈ కాంపౌండ్ హీరోలకు కమర్షియల్‌గా కలసి రాలేదు. రాబోయే సినిమాలైనా వర్కవుట్ అవుతాయేమో చూడాలి.