Advertisement
Google Ads BL

రికార్డుల పిచ్చిని బాగుచేసేదెవ‌రు?


సినిమా బాగుందా, లేదా అనేది సామాన్య ప్రేక్ష‌కుడికి కావాల్సిన అంశం. కానీ ఆ సినిమా ఎన్ని రోజులు హౌస్‌ఫుల్ అయింది, ఎంత క‌లెక్ట్ చేసింది, అది థియేట‌ర్ రికార్డా, టౌన్ రికార్డా.. అని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డేది అభిమానులే. ఓ ముప్పై ఏళ్ల క్రితం ఈ రికార్డుల పిచ్చి విప‌రీతంగా ఉండేది. ఫ్యాన్స్ త‌మ హీరో సినిమా ఆడుతున్న థియేట‌ర్ ద‌గ్గ‌ర కాపుకాసి, డీసీఆర్ (డైలీ క‌లెక్ష‌న్ రిపోర్ట్‌) చూసుకుంటూ కాల‌క్షేపం చేసేవాళ్లు. త‌మ పోటీ హీరో సినిమా కంటే త‌మ అభిమాన హీరో సినిమా హిట్ కావాల‌ని వాచీలు, ఉంగ‌రాలు తాక‌ట్టు పెట్టి ఆ డ‌బ్బుల‌తో టికెట్లు కొనేవాళ్లు. హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టించేవాళ్లు.

Advertisement
CJ Advs

ఇలాంటి విష‌యాల్లో పోటీ అభిమాన సంఘాల పోట్లాట‌లు నిత్య‌కృత్య‌మ‌య్యేవి. కొన్ని సినిమాల‌ను అభిమానులు బ‌ల‌వంతంగా వంద రోజులు ఆడించేవాళ్లు. ఆ సినిమాల‌ను ‘లాగుడు సినిమాలు’ అంటూ జోక్‌లు వేసుకొనేవాళ్లు. శ్లాబ్ విధానం వ‌చ్చాక‌, ఇలా బ‌ల‌వంతంగా సినిమాని వంద రోజులు ఆడించాలంటే న‌ష్టం వ‌చ్చేది. ఆ న‌ష్టాన్ని ఆ సినిమా డిస్ట్రిబ్యూట‌రో, థియేట‌ర్ ఓన‌రో భ‌రించాల్సి వ‌చ్చేది. మ‌ళ్లీ ఆ హీరో త‌ర్వాతి సినిమా కోసం ఈ న‌ష్టాన్ని భ‌రించేవాళ్లు.

ఇప్పుడు ఆ మొహ‌మాట ధోర‌ణి పూర్తిగా న‌శించింది. బాగుంటే ఆ సినిమాని ఆడిన‌న్నాళ్లు ఉంచుతున్నారు. బాగోలేక‌పోతే డెఫిసిట్ వ‌చ్చిన మ‌రుస‌టి రోజే తీసేస్తున్నారు. ఇందుకు చిన్నా పెద్దా హీరోల తేడా లేదు. ఇదివ‌ర‌క‌టిలా సినిమాలు వంద రోజులు ఆడే ప‌రిస్థితి ఇవాళ లేదు. ఒక‌ప్పుడు వంద థియేట‌ర్లలో సినిమా రిలీజ్ చేయ‌డ‌మే పెద్ద విశేషంగా ఉంటే, ఇప్పుడు వేల థియేట‌ర్ల‌లో స్టార్ల సినిమాల‌ను రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఎక్కువ రోజులు సినిమాల‌ను థియేట‌ర్ల‌లో ఆడించే స్థితి లేదు. పైగా పైర‌సీ రాక‌తో థియేట‌ర్ల‌లో సినిమా న‌డిచే కాలం కుదించుకుపోయింది.

ఇవాళ ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింద‌న్న‌ది ప్ర‌యారిటీ కాదు.. ఎంత క‌లెక్ట్ చేసింద‌న్న‌దే ప్ర‌యారిటీ. దాంతో క‌లెక్ష‌న్ రికార్డుల పిచ్చి మ‌ళ్లీ ముదిరింది. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ‌య్యిందంటే.. అది ఎంత క‌లెక్ట్ చేసింద‌నే అధికారిక స‌మాచారం ఎవ‌రూ ఇవ్వ‌ట్లేదు. ఫ్యాన్స్ ఒత్తిళ్ల‌తో ప్రొడ్యూస‌ర్లు ఫేక్ క‌లెక్ష‌న్ రిపోర్టులు ఇస్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా న‌డిచింది.

ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన ఇద్ద‌రు స్టార్ల సినిమాల క‌లెక్ష‌న్ విష‌యంలో ఏర్ప‌డిన పోటీతో ఆ సినిమాల నిర్మాత‌లు ఇద్ద‌రూ ఫేక్ క‌లెక్ష‌న్ల‌ను ఇస్తూ వ‌చ్చార‌నేది ఇండ‌స్ట్రీ టాక్‌. త‌మ‌ది ‘నాన్‌-బాహుబ‌లి 2’ రికార్డు అంటూ రెండు సినిమాల నిర్మాత‌లూ చెప్పుకుంటూ వ‌చ్చారు. రికార్డుల పిచ్చికి నిర్మాత‌లే ఆజ్యం పోస్తున్నార‌నీ, హీరోలు వీటిని ఎంక‌రేజ్ చేస్తున్నార‌నీ విమ‌ర్శ‌లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది ఇండ‌స్ట్రీలో అనారోగ్య‌క‌ర వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తోంది. ఫ్యాన్స్‌కే ప‌రిమిత‌మై ఉండే రికార్డుల పిచ్చిలో హీరోలు, ప్రొడ్యూస‌ర్లు కూడా ప‌డితే ఇక ఆ పిచ్చిని బాగు చేసేదెవ‌రు?

Records Fights between Star Heroes Fans :

Heroes and Producers involved in Fake Collection Records
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs