చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. డిసెంబర్ నెలలో ప్రారంభమైన దీని ఉధృతి ఇప్పటికీ తగ్గలేదు. మళ్లీ డిసెంబర్ వచ్చేదాకా కూడా తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటికీ వ్యాక్సిన్ రాకపోవడంతో రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇండియాలో ఇప్పటికే కేసులు 2 లక్షలు దాటిపోయాయి. ఇక అసలు విషయానికొస్తే.. కరోనా లాక్ డౌన్‌తో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆగిపోవడంతో విదేశాల్లో (జోర్డాన్) చిక్కుకుపోయిన మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ నానా తంటాలు పడి ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితం స్వరాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. విదేశాల్లో ఉండిపోవడం, ఫ్లైట్‌లో జర్నీ చేయడం, ఇంటికి వచ్చాక మిత్రుల్ని కలిసిన ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నాడు.
టెస్ట్ చేయించుకోబోతున్నాడని తెలిసినప్పటి నుంచి ఫలితం వచ్చేదాకా అభిమానుల్లో ఒక్కటే టెన్షన్.. తీరా చూస్తే కరోనా ‘నెగిటివ్’ రావడంతో హమ్మయ్యా.. అంటూ ఊపిరిపీల్చుకున్నారు. క్వారంటైన్ అనంతరం తాను కరోనా టెస్ట్ చేయించుకున్నానని నెగిటివ్ అని ఫలితం వచ్చిందని పృథ్విరాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అంతేకాదు తాను చేయించుకున్న టెస్ట్ తాలుకూ వివరాలు సైతం ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఆయన పంచుకున్నాడు. కాగా పృథ్వీరాజ్‌తో పాటు ఆయనతో విదేశాల్లో ఉన్న.. ఇంటికి వచ్చిన టీమ్ మొత్తం టెస్ట్‌లు చేయించుకున్నారు.
ఆయన టీమ్‌లో ఎవరికీ పాజిటివ్ రాలేదని తెలియవచ్చింది. అన్ని రోజులు విదేశాల్లో ఉన్న ఆయన.. టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంది కాబట్టే కరోనా వారి దరిదాపుల్లోకి రాలేదని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ చేయించుకున్న తర్వాత పృథ్వీరాజ్ కుటుంబంతో కలిసి హాయిగా ఉన్నాడు. కాగా.. లాక్ డౌన్ తర్వాత మళ్లీ పృథ్వీ జోర్డాన్ వెళ్లి షూటింగ్ చేస్తాడా.. లేకుంటే వద్దు బాబోయ్ అంటూ స్వరాష్ట్రంలో ప్లాన్ చేస్తారో వేచి చూడాలి.