150 మిలియన్ వ్యూస్ దాటిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’లోని సెన్సేషనల్ సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాట యూట్యూబ్‌లో సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తోంది. సంగీత ప్రియుల ఆదరణతో 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న సినిమాల పాటల్లో ఈ ఫీట్ సాధించిన సాంగ్‌గా సరికొత్త చరిత్రను సాధించింది. సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే’ చిత్రాలకు పనిచేసిన మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కన్నడ చిత్రసీమలో విజయవంతమైన చిత్రాల నిర్మాతగా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు.
అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా, ‘నీలి నీలి ఆకాశం’ పాటతో సహా చిత్రంలోని అన్ని పాటలనూ చంద్రబోస్ రాశారు. ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్‌పై చిత్రీకరించిన ‘నీలి నీలి ఆకాశం’ పాట 150 మిలియన్ వ్యూస్ దాటడంతో చిత్ర బృందమంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఇదొక అరుదైన ఫీట్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. స్టార్లు లేని ఒక చిన్న సినిమాలోని పాటకు ఈ స్థాయి ఆదరణ లభించడం అపురూపమైన విషయంగా వారు చెబుతున్నారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన వినసొంపైన బాణీలకు చంద్రబోస్ రాసిన కమనీయ సాహిత్యం, సింగర్స్ సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం తోడై ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయని నిర్మాత ఎస్వీ బాబు అన్నారు. ఈ సందర్భంగా సంగీత ప్రియులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఒక సింగర్‌ను ఐదేళ్లు బ్రతికించడానికి ఒక పాట చాలనీ, నీలి నీలి ఆకాశం అలాంటి పాటనీ గాయని సునీత అన్నారు. తన కెరీర్‌లో ఈ పాట ఓ మధురమైన మలుపుగా నిలించిందని ఆమె అమితానందం వ్యక్తం చేశారు. ఈ పాట విజయోత్సవంలో తాను భాగస్వామినే కాకుండా భావస్వామిని కూడా అయినందుకు గర్వపడుతున్నానని లిరిసిస్ట్ చంద్రబోస్ చెప్పారు. ఈ పాటను అమలాపురం నుంచి అమెరికా దాకా అందరూ పాడుకుంటున్నారని డైరెక్టర్ మున్నా సంతోషం వ్యక్తం చేశారు. తాను ఇప్పటివరకూ కంపోజ్ చేసిన సాంగ్స్‌లో ఏ పాటనీ విననన్ని సార్లు ఈ పాటను విన్నానని మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రెబెన్స్ అన్నారు.
‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమా ఔట్‌పుట్ చూసి నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలతో జీఏ2, యువి క్రియేషన్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇలా రెండు అగ్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థల సపోర్ట్ లభించడం సినిమాకి ప్లస్ అవుతోంది. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సమసిపోయి, సాధారణ పరిస్థతి నెలకొన్న తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాత ఎస్వీ బాబు చెప్పారు.
తారాగణం:
ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్, శివన్నారాయణ, హేమ, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, హైపర్ ఆది, ఆటో రామ్‌ప్రసాద్, భద్రం, జబర్దస్త్ మహేష్.
సాంకేతిక బృందం:
పాటలు: చంద్రబోస్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
ఆర్ట్: నరేష్ తిమ్మిరి
పీఆర్వో: వంశీ-శేఖర్
నిర్మాత: ఎస్వీ బాబు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మున్నా.