శనివారం (మే 30) దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు మూడో వర్ధంతిని పురస్కరించుకొని యంగ్ హీరో మనోజ్ మంచు ఆయనకు నివాళులర్పించారు. మొయినాబాద్‌లోని దాసరి ఫామ్‌హౌస్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే అక్కడే ఉన్న దాసరి సతీమణి దివంగత దాసరి పద్మ విగ్రహానికి కూడా ఆయన నివాళులర్పించారు. మరణించిన తర్వాత కూడా చిత్రసీమలోని అందరి హృదయాల్లో దాసరి నారాయణరావుగారు జీవించి ఉన్నారనీ, దాన్ని బట్టే ఆయన ఎంత గొప్పవారో ఊహించుకోవచ్చనీ మనోజ్ అన్నారు.
సినిమా ఇండస్ట్రీ అంతా గురువుగారు అని పిలుచుకొనే ఒకే ఒక్క వ్యక్తి, మహనీయుడు, మహా దర్శకుడు దాసరి గారనీ, అలాంటి గొప్పవ్యక్తి 2017 మే 30న మనకు భౌతికంగా దూరమవడం జీర్ణించుకోలేని విషయమని ఆయన చెప్పారు. దాసరి కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందేననీ, ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని మనోజ్ తెలిపారు.