కరోనా వైరస్ రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో వలస కూలీలు తమ స్వస్థలాలకి వెళ్ళిపోతున్నారు. బస్సులు లేకున్నా నడిచివెళ్తున్న వీరిని తమ సొంత ఊళ్లలో దింపడానికి పలు స్వచ్చంద సంస్థలు కృషి చేస్తున్నాయి. బ్రతుకు తెరువుకోసం వేరే చోటికి వచ్చి, కష్టకాలంలో పనిలేక అవస్థలు పడుతూ ఉండలేక తమ ఇంటికి పయనమవుతున్న వారికి సాయం చేయడానికి ప్రభుత్వాలు రైళ్ళు వేసినా, ఇంకా అలా వెళ్ళవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
వారి కష్టం తీర్చడానికి, వారిలో కొందరినైనా తమ సొంతింటికి చేర్చడానికి ఎంతో మంది కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో సినిమా సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. మనం బాగున్నప్పుడు వినోదం అందించి మనల్ని ఆనందింపచేసే సెలెబ్రిటీలు కష్ట సమయంలో తోడుగా నిలుస్తున్నారు. అలా తోడు నిలుస్తున్నవారిలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా ఒకరు. సోనూ సూద్ ముంబయిలోని తన హోటల్ ని క్వారంటైన్ కేంద్రంగా మార్చేశాడు.
అంతే కాదు వలస కార్మికుల కోసం స్పెషల్ బస్సులని నడుపుతూ వారి సొంత ఊళ్లకి పంపిస్తున్నాడు. తాజాగా సోనూసూద్ 177 మంది మహిళా కార్మికుల కోసం స్పెషల్ ఫ్లైట్ ని ఏర్పాటు చేశాడు. కేరళలోని ఎర్నాకులంలో పనిచేసే 177మంది మహిళా కార్మికులని తమ సొంత ఊళ్ళో దింపడానికి ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుని వారిని ప్రత్యేక విమానంలో పంపించాడు. నిజంగా సోనూసూద్ ఎంత మంచివాడో కదా..!