టాలీవుడ్ సినిమా షూటింగ్స్ పున: ప్రారంభంపై, సీఎం కేసీఆర్‌తో సినీ పెద్దలు భేటీ కావడంపై సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య సంచలన వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం మొదలైన సంగతి తెలిసిందే. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రముఖ సినీ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా నాగబాబు మాట్లాడుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
స్ట్రాంగ్ వార్నింగ్..
బాలకృష్ణ ఇవాళ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. తక్షణమే టాలీవుడ్ ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీటింగ్‌కు మిమ్మల్ని పిలవలేదని చెప్పడంలో తప్పులేదు కానీ.. ఎందుకు పిలవలేదనే దానిపై మీరు తెలుసుకోవాలన్నారు. బహుశా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బాలయ్యను మీటింగ్‌కు పిలిచి ఉండకపోవచ్చన్నారు. మీరు ఇవాళ చాలా చాలా మాట్లాడేశారు. ‘బాలయ్యా.. ఇండస్ట్రీకి మీరేం కింగ్ కాదు.. మీరు కూడా ఒక హీరో మాత్రమే. నోరు అదుపులో పెట్టుకొని.. బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి. మీరు ఏం మాట్లాడినా.. నోరు మూసుకుని కూర్చోడానికి ఎవరూ లేరు. మాటలు కంట్రోల్‌లో ఉండాలి. నోరు కంట్రోల్‌లో పెట్టుకోండని లేకపోతే మీ కంటే పది రెట్లు ఎక్కువగా మేమూ మాట్లాడతాం అనే విషయాన్ని గుర్తెట్టుకోవాలి’ అంటూ బాలయ్యకు నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
భూముల లెక్కలివీ..
‘భూములను పంచుకున్నారంటూ మీరు చేసిన వ్యాఖ్యలు నిజంగా నన్ను చాలా బాధించాయి. ఒక నిర్మాతగా, నటుడిగా నన్ను ఎంతో బాధించాయి. నాకు చాలా ఆవేదనగా ఉంది. నోటికి వచ్చినంత మాట్లాడటం సరికాదు. ఈ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీటింగ్ పెట్టింది.. పెద్దలు వెళ్లింది ఇండస్ట్రీ బాగు కోసమే కానీ.. భూములు పంచుకోవడానికి కాదు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు. ఇక్కడ ఎవడూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలేదు.. అది ఎవరు చేశారో.. ఆంధ్రప్రదేశ్‌కి వెళ్తే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని నమ్మి ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయో మీరు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల అన్నది తెలుస్తోంది’ అంటూ నాగబాబు రూట్ మార్చి మరీ బాలయ్యపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. నాగబాబు వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరిందని చెప్పుకోవచ్చు.. ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో.. ఎప్పుడు ఆగుతుందో.. ఎవరు దీనికి ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూడాలి.