టాలీవుడ్ సినిమా షూటింగ్స్ పున: ప్రారంభంపై, సీఎం కేసీఆర్‌తో సినీ పెద్దలు భేటీ కావడంపై సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలయ్య వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం మొదలయినట్లయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఇంట్లో భేటీ కావడం మొదలుకుని సీఎం కేసీఆర్‌తో చర్చించడం వరకూ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వంతో చర్చల విషయం పత్రికల్లో వార్తలు చూసి తెలుసుకున్నానని చెప్పారు. ఒక్క సమావేశానికి కూడా తనను పిలవలేదని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన.. హైదరాబాద్‌లో కూర్చుని భూములు పంచుకుంటున్నారా? అంటూ కన్నెర్రజేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ బాలకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
గురువారం నాడు దివంగత నటుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య.. నాన్నగారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా టాలీవుడ్ షూటింగ్స్, సినీ పెద్దల విషయంపై మాట్లాడాలని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ఆయన స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా.. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి గాను సీసీసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చారిటీకి నటీనటులు పెద్ద ఎత్తున సాయం చేయగా.. బాలయ్య కూడా రూ. కోటి 15 లక్షల విరాళం ఇచ్చిన విషయం విదితమే.