నందమూరి తారక రామారావు అన్న పేరు తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన ఎన్టీఆర్ ఒక కారణజన్ముడు. నేడు ఆయన 97వ జయంతి జరుపుకుంటున్న వేళ తెలుగువారి గుండె పులకరిస్తుంది. ఆయన మనల్ని వదిలి వెళ్ళి 24 ఏళ్లవుతున్నా కూడా ఆ పేరు విన్న ప్రతీసారి తెలుగుదనం నరనరాన ప్రవహించినట్టు అవుతుంది. అన్నీ బాగుంటే ఆయన పుట్టినరోజున ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకి చేరుకుని నివాళులు అర్పించేవారు.
కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయాన కుటుంబ సభ్యులెవరూ ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వెళ్లకూడదని నిశ్చయించుకున్నారు. ప్రజా క్షేమం కోసం కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు కూడా గౌరవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారకరావు గారిని తలచుకుంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. నీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది… పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు.